వారణాసి నాగలక్ష్మి

From tewiki
Jump to navigation Jump to search

వారణాసి నాగలక్ష్మి రచయిత్రి, చిత్రకారిణి.

విశేషాలు

ఈమె కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని ప్లీడరు గారి తోటలో ముష్ఠి రామకృష్ణశాస్త్రి, పార్వతి దంపతులకు దంపతులకు జన్మించింది. ఈమె నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో బి.ఎస్.సి వరకు చదివి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ, ఎం.ఫిల్ పట్టాలను పొందింది. హైస్కూలు చదువు నుండి చదువు పూర్తి అయ్యే వరకు జాతీయ స్కాలర్‌షిప్‌ను పొందిన ప్రతిభావంతురాలు ఈమె. మూడు పర్యాయాలు విశ్వవిద్యాలయస్థాయి పరీక్షలలో ఈమె మొదటి స్థానాన్ని సంపాదించింది. ఈమె భర్త వి.ఎస్.శర్మ ఇ.ఎన్.టి. వైద్యుడు. వీరికి జయంత్, వర్షిణి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చిత్రకళ

దస్త్రం:Aasaraa coverpage.jpg
ఆసరా కథా సంపుటం కవర్‌పేజీకి వారణాశి నాగలక్ష్మి వేసిన స్వీయచిత్రం

ఈమె గీసిన అనేక వర్ణచిత్రాలు అనేక బహుమతులను గెలుచుకున్నాయి. నవరంగ్ చిత్రకళానికేతన్ వారు నిర్వహించిన ఔత్సాహిక చిత్రకారుల పోటీలో ఈమె పెయింటింగ్ 'సఫరింగ్'కు జాతీయ స్థాయి బహుమతి లభించింది. సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్ట్ వారి చిత్రప్రదర్శనలో ఈమె 'మమత ' చిత్రానికి ఉత్తమ పెయింటింగ్ అవార్డ్ లభించింది. ఎలీ లిల్లీ వారి 'ఆంకాలజీ ఆన్ కాన్వాస్' అంతర్జాతీయ పెయింటింగ్ పోటీలలో ఈమె గీసిన 'బ్లూస్&బ్లూమ్స్ ' చిత్రం ఎంపికై రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, లండన్‌లో ప్రదర్శించబడింది.

సాహిత్యం

ఈమె కథలు, గేయాలు అనేకం రచించింది. సిలికానాంధ్ర - రచన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన గీత రచనల పోటీలలో 2003, 2004 సంవత్సరాలలో ఈమెకు బహుమతులు లభించాయి. ఈమె వ్రాసిన పాటలు రేడియో, టి.వి.ల ద్వారా ప్రసారమయ్యాయి. ఈమె కథలకు రచన, స్వాతి, ఆంధ్రభూమి, కౌముది తదితర పత్రికలు నిర్వహించిన కథలపోటీలలో బహుమతులు వచ్చాయి. ఈమె లలిత గీతాల సంపుటి "వాన చినుకులు"కు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీపురస్కారం, కథల సంపుటి "ఆలంబన"కు అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారం లభించాయి. ఈమె "ఊర్వశి" నృత్యనాటికను "ఆసరా", "వేకువపాట" అనే కథాసంపుటులను కూడా వెలువరించింది.

మూలాలు

బయటిలింకులు