వెన్నునొప్పి

From tewiki
Jump to navigation Jump to search
వెన్నునొప్పి
Spinal column curvature-te.svg
వెన్నెముకలోని వేర్వేరు భాగాలు
ప్రత్యేకతఎముకల శాస్త్రం

వెన్నునొప్పి, అనేది వీపు వెనుకభాగంలో వచ్చే నొప్పి. ఇది సాధారణంగా కండరాల నుండికానీ, నరాల నుండికానీ, ఎముకల నుండికానీ, కీళ్ళ నుండికానీ, వెన్నుపాములోని ఇతర భాగాల నుండికానీ పుడుతుంది. ఈ నొప్పి మెడనొప్పి, వెన్ను పైభాగపు నొప్పి, వెన్ను దిగువభాగపు నొప్పి, హలాస్థి నొప్పిగా విభజించబడింది. ఈ నొప్పిలో కటి ప్రాంతం ఎక్కువగా ప్రభావితమవుతుంది.[1] వెన్నునొప్పి స్వల్ఫకాలికంగా, దీర్ఘకాలికంగా.. ఒకే చోటకానీ, అనేక ప్రదేశాలకు విస్తరిస్తూ కానీ ఉండవచ్చు. చేతులు, కాళ్ళు, అడుగులు[2] తిమ్మిరి కలిగి ఉండవచ్చు, బలహీనంగా మారవచ్చు.

వెన్నునొప్పిలో ఎక్కువభాగం గుర్తించదగిన కారణాలు లేవు. అనేక రకాల వైద్య సమస్యలకు ఇది ఒక లక్షణంగా భావించాలి. కీళ్ళు బలహీనపడి, కండరాలు, నరాలలో నొప్పిని కలిగిస్తాయి. పిత్తాశయం, క్లోమం, బృహద్ధమని, మూత్రపిండాల వ్యాధి, వాపు కూడా వెనుకభాగంలోని నొప్పికి కారణం కావచ్చు.

వెన్నునొప్పి మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి. పెద్దవాళ్ళలో ప్రతి పదిమందిలో తొమ్మిది మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ వెన్నునొప్పి వస్తుంది. ప్రతి పదిమంది శ్రామికులలో ఐదు మందికి, ప్రతి సంవత్సరమూ వెన్నునొప్పి కనపడుతుంటుంది.[3] 95% మంది ప్రజలు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో వెన్నునొప్పిని అనుభవిస్తారని అంచనా వేయబడింది.[1] ఇది దీర్ఘకాలిక నొప్పిగా, వైకల్యానికి ప్రధాన కారణంగా మారవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా శస్త్రచికిత్సలు చేయడం వంటివి ఈ వెన్నునొప్పికి పరిష్కార మార్గాలు.

వర్గీకరణ

శరీర నిర్మాణ రీత్యా వెన్నునొప్పిని, మెడ నొప్పి, వెన్ను పైభాగపు నొప్పి, వెన్ను కింది భాగపు నొప్పి, హలాస్థి నొప్పి అని విభజిస్తారు.

అది సంభవించే కాల అవధిని బట్టి: దానిని, తీవ్రమైన (4 వారాల కంటే తక్కువ సమయం), కొంచెం తీవ్రమైన (4 – 12 వారాల లోపు), ఎడతెగని (12 వారాల కంటే ఎక్కువ) నొప్పులుగా విభజిస్తారు.

కారణాల రీత్యా: కండర అస్థిపంజర సంబంధమైన, సంక్రమణ సంబంధమైన, క్యాన్సర్, మొదలైన వాటిగా విభజిస్తారు.

వ్యాధి శాస్త్రం ప్రకారం వెన్ను నొప్పిని, యాంత్రికమైన, లేదా అనిర్దిష్టమైన వెన్ను నొప్పి, ద్వితీయ వెన్ను నొప్పిగా విభజిస్తారు. వెన్నునొప్పితో బాధ పడే వారిలో 98% మంది అనిర్దిష్టమైన తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. వ్యాధి అధ్యయన శాస్త్రం ప్రకారం దీనిని అంత తీవ్రంగా పట్టించుకోనవసరం లేదు. కేవలం 2% కేసులలో మాత్రమే ద్వితీయ వెన్ను నొప్పి ఉంటుంది. ఇది తీవ్రంగా పట్టించుకోవలసిన నొప్పి. వ్యాధి అధ్యయనం శాస్త్రం ప్రకారం ఈ రకపు నొప్పి ఒక శాతం రోగులలో కనబడుతుంది. ఇది వ్యాప్తి చెందే లక్షణం ఉన్న క్యాన్సర్ వల్ల కాని, వెన్నుపాములోని అస్థి మజ్జలో కలిగే నొప్పి వల్ల కాని, ఎపిడ్యురల్ పుండ్ల వల్ల కానీ కలుగుతుంది. ఈ స్థితిలో నొప్పితో పాటుగా, కశేరుక చక్రిక పక్కకు తొలగడం అనే నాడీ సంబంధ అశక్తత సాధారణంగా ఉంటుంది. 95% కేసులలో కశేరు చక్రిక, కటి కశేరుకపు చివరి రెండు స్థానాలలో పక్కకు తొలుగుతుంటుంది.

అనుబంధ పరిస్థితులు

వెన్నునొప్పి అనేది అంతబాగా పట్టించుకునే కారణం కానప్పటీకీ, వైద్య పరంగా అది తీవ్రమైన సమస్యకు సంకేతం:

 • పేగులు, లేదా మూత్రకోశం నుండి అనియంత్రిత మూత్ర విసర్జన, కాళ్లలో బలహీనత పెరగడం వంటివి జీవితానికి ప్రమాదం కలిగించేవిగా పరిగణించవలసిన సంక్లిష్ట సంకేతాలు.
 • తీవ్రమైన జబ్బును సూచించే ఇతర లక్షణాలతో (ఉదా: జ్వరం, ఇదమిత్తంగా చెప్పలేని బరువు తగ్గిపోవడం) ) పాటుగా, నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే (నిద్ర) కు ఆటంకం కలిగించే తీవ్రతతో ఉన్న నొప్పి రోగి ఆనారోగ్య స్థితి తీవ్రంగా ఉన్నట్లుగా భావించాలి.
 • కారు ప్రమాదం వంటివి జరిగి, తీవ్రంగా గాయాలైన తర్వాత వెన్నునొప్పి కనబడితే అది ఎముక విరిగిపోవడం లేదా గాయపడడం వల్ల అయి ఉండవచ్చు.
 • వెన్నునొప్పితో బాధపడే వ్యక్తులలో వెన్నుపాముకు సంబంధించి ఆస్టియోపోరోసిస్, అస్థి మజ్జలో కణుతులు ఏర్పడడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు, వారికి కచ్చితమైన వైద్యసహాయం అవసరం.
 • క్యాన్సర్ చరిత్ర (వక్షము, ఊపిరితిత్తులు, పౌరుష గ్రంథి క్యాన్సర్ల వలెనే వెన్నుపాములో కూడా క్యాన్సర్ వ్యాపిస్తుంది) కలిగిన వ్యక్తులలో వెన్నునొప్పి కనబడినట్లయితే, నియమాలననుసరించి అది వెన్నుపాముకు సంబంధించిన క్యాన్సర్ కణితి అవునా కాదా అని పరీక్షించాలి.

వెన్నునొప్పి కలిగిన ప్రతిసారి తక్షణం వైద్య సహాయం అవసరం లేదు. వెన్నునొప్పి కనబడిన చాలా సందర్భాలలో అది ఆ ప్రాంతానికే పరిమితమై, ఇతర చోట్లకు వ్యాపించకుండా ఉంటుంది. చాలా వెన్నునొప్పులు, ప్రత్యేకించి తీవ్రమైన దశలో-బాధవల్ల కలుగుతాయి. ఈ దశ రెండు వారాల నుండి మూడు నెలల వరకు ఉంటుంది.

కొన్ని పరిశీలనాత్మక అధ్యయనాలు వెన్నునొప్పికి రెండు కారణాలను సూచిస్తున్నాయి. అవి కటి కశేరు చక్రికలు పక్కకు తొలగడం, కశేరు చక్రికలు వ్యాధి వలన క్షీణించడం. ఇవి వెన్నునొప్పికి అంత సాధాణమైన కారణాలు కాకపోవచ్చు. ఈ రకమైన నొప్పులు వేటి వలన వస్తాయో అంత బాగా తెలియదు. ఇతర అధ్యయనాల ప్రకారం, 85% కేసులలో వెన్నునొప్పికి సరైన శరీర ధర్మ శాస్త్ర కారణం తెలియదు. ఎక్సరేలలోనూ, ఇతర స్కానింగ పద్ధతుల వల్లనూ తెలిసే నిర్మాణ పరమైన అసాధారణతల కంటే, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సంబంధాలు సరిగా లేక పోవడం వంటి మానసిక కారణాలే వెన్నునొప్పికి ఎక్కువగా కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

కారణాలు

కూర్చునే పద్ధతి వల్ల

సరైన పద్ధతిలో కూర్చోకపోవడం లేదా వెన్నును ఉంచకపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. చాలా మంది తమ ఉద్యోగ బాధ్యతల వల్ల వెన్నును సరైన పద్ధతిలో ఉంచలేకపోతుంటారు. పైగా ఉద్యోగుల్లో చాలామంది ఒకేచోట కూర్చుని పనిచేసే వృత్తిలో ఉంటారు. అలాంటి వృత్తుల్లోని వారు సరైన పద్ధతిలో కూర్చోలేకపోవడంతో వెన్నునొప్పి సహజం.

జన్యుపరమైన అంశాలు

కొందరిలో కుటుంబం లోనే సాధారణంగా వెన్నునొప్పులు ఎక్కువగా ఉంటాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, న్యూరోఫెబ్రొమాటిస్, స్కోలియోసిస్, మెదడు లేదా వెన్నుపూసలలో ఉండే కొన్ని అసాధారణత (అనామలీ) ల వల్ల వెన్ను నొప్పి వస్తుంది. ఈ తరహా సమస్యలు పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా వస్తాయి. దగ్గరి బంధువులను పెళ్ళిళ్లు చేసుకోవడం అన్నది ఈ తరహా సమస్యలకు ఎక్కువగా దోహదపడే అంశం.

పిల్లలకు

పిల్లలు పాఠశాల బ్యాగ్‌ను మోస్తున్న సమయంలో వాళ్ల భుజాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో కూడా వెన్ను నొప్పి రావచ్చు. అయితే కేవలం ఆ కారణంగానే పిల్లలకు వెన్ను నొప్పి వస్తుందనే అంశంపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. వారి సామర్థ్యం కంటే ఎక్కువ భారాన్ని మోసే సమయంలో ఒకటి రెండు తరాల తర్వాతి వారికి వెన్నునొప్పి వస్తుంది.

ఆస్టియోపోరోసిస్

ఎముక బలహీనమైపోయే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేసియా వంటి వ్యాధులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. దాంతో వచ్చే సమస్యలైన ఫ్రాక్చర్లు, ఇతర కాంప్లికేషన్స్ ఎక్కువ. పైగా పొట్ట తగ్గించడానికి చేయించుకునే బేరియాటిక్ సర్జరీలతో కాల్షియం, విటమిన్ డి వంటి సప్లిమెంట్లు సరిగా అందకపోవడం వల్ల కూడా ఎముక సాంద్రత కోల్పోయి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే వెన్నునొప్పి నివారణకు పూర్తి పోషకాలు అందేలా చూడటం కూడా అవసరం. స్టెరాయిడ్స్, థైరాక్సిన్, గ్రోత్ హార్మోన్స్, కీమోథెరపీ... వంటి సందర్భాల్లోనూ ఎముకలపై వాటి ప్రభావం ఉంటుంది. వెన్నెముక కూడా దానికి మినహాయింపు కాదు.

సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్, మైలోపతి

చాలా సందర్భాల్లో మెడ దగ్గర నుంచి భుజానికి నొప్పి పాకడం వంటి సమస్య కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో భుజం నుంచి చేతి వేళ్ల వరకు కాస్త బలహీనంగా మారినట్లుగా కూడా అనిపించవచ్చు. వెన్నెముకలోని డిస్క్‌లు ఒకదానితో మరొకటి ఒత్తుకోవడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. దాన్ని సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీని వల్ల వెన్నులో కొన్ని శాశ్వత (ఇర్రివర్సిబుల్) మార్పులు రావచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో ముందుగానే సమస్యను కనుగొని తగిన చికిత్స తీసుకోవడం అవసరం. మరికొన్ని సందర్భాల్లో వెన్నులో నొప్పి... వీపు కు పైభాగంలో మెడ వద్ద ఉన్న వెన్నుపూసలలో నొప్పితోనూ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మందులు కూడా పనిచేయనప్పుడు అత్యంత సునిశితంగా నిపుణులు శస్త్రచికిత్సతో ఆ సమస్యలకు చికిత్స చేయవచ్చు.

ప్రమాదాలు (ట్రామా) 

కొన్ని సందర్భాల్లో వెన్నుపూసలలో దేనికైనా దెబ్బతగలడం వల్ల అవి ఉన్న స్థానం నుంచి పక్కకు జరగవచ్చు. అలాంటప్పుడు కూడా మున్ముందు నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలను నివారించడానికి అత్యవసరంగా వెన్నుకు శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది.

వైవిధ్య వ్యాధి నిర్ధారణ

వెన్ను నొప్పికి అనేక కారణాలు, సంభావ్యతా స్థానాలు ఉన్నాయి.[4] వెన్నుపాముకు సంబంధించిన ప్రత్యేక కణ జాల నిర్దారణ ద్వారా నొప్పికి కారణాలను కనుగొన వచ్చును. వెన్నుపాముకు సంబంధించిన వివిధ కణజాలాల నుండి వ్యక్తమయ్యే లక్షణాలు ఒకే రకంగా ఉండడం వలన వాటిని విడదీసి చూడడం చాలా కష్టం. దీని కోసం ఆ ప్రాంతంలో మత్తుమందు ఇవ్వడం వంటి, శరీరంలోకి చొప్పించే విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది.

వీపు భాగంలో ఉన్న అస్థిపంజర కండరం, వెన్నునొప్పికి సంభావ్యతా స్థానం. కండరాలు ఒత్తిడికి గురి కావడం (కండరాల సంకోచం),, కండరాల అనియంత్రిత వ్యాకోచం, కండర అసమతుల్యత వంటివి కండర కణజాలంలో నొప్పికి కారణాలు. కండర కణజాలం నాశనం కావడంమే వెన్నునొప్పికి కారణం అనడానికి స్కానింగ్ వలన తేలిన అధ్యయనాలు సహకరించడం లేదు. కండరాల అనియంత్రిత సంకోచానికి సంబంధించిన నాడీ శరీర ధర్మ శాస్త్రం, కండరాల అసమతుల్యతల గురించి సరిగా తెలియదు.

వెన్ను దిగువ భాగపు నొప్పికి సంభావ్యతా స్థానాలు, వెన్నుపాముకు సంబంధించిన కదిలే కీళ్ళు ( ఉదా: జైగపోఫిజికల్ జాయింట్స్/ ప్యాసెట్ జాయింట్స్). వెన్నుదిగువ భాగపు ఎడతెగని నొప్పితో బాధపడే మూడింట ఒక వంతు జనంలోనూ, గాయం కారణంగా మెడనొప్పితో బాధ పడే చాలా మందిలోనూ ఇవే ప్రాథమిక సంభావ్యతా స్థానాలుగా ఉంటాయి.[4] అయితే, జైగపోఫిజియల్ కీళ్ల నొప్పికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. గాయమైన తర్వాత కలిగే మెడనొప్పికి క్యాప్సూల్ కణజాలం నాశనమవడం కారణమని చెబుతున్నారు. జైగపోఫీజియల్ కీళ్ల నుండి వచ్చే వెన్ను నొప్పి కల వారిలో ఒక సిద్ధాంతం ప్రకారం, సినోవియెల్ మెంబ్రేన్‍లు, తంతుయుత ఎడిపోస్ కణజాల అస్థి సంధాయకాలు వంటి ఇంట్రాఅర్టిక్యులార్ టిష్యూ స్థాన చలనం చెందడం వల్ల, కుంచించుకు పోవడం వల్ల, ఆటంక పరచబడడం వల్ల, కణజాల క్షయం జరిగి నొప్పి (నొప్పి) కలుగుతుంది.

వెన్ను నొప్పికి అనేక సాధారణమైన సంభావ్యతా స్థానాలు, కారణాలు ఉన్నాయి: వీటిలో కశేరు చక్రికలు పక్కకు తొలగడం, కశేరు చక్రికలు వ్యాధి వలన క్షీణించడం, లేదా ఇస్తమిక్ స్పాండైలోలిస్థేసిస్, ఆస్టియోఆర్థరైటీస్ (కీళ్ళు క్షీణించే వ్యాధి) ), త్రిక ప్రాంతపు కశేరుకుల్య కుంచించుక పోవడం, తీవ్రమైన గాయాలు కలగడం, క్యాన్సర్, సంక్రమణ, ఎముకలు విరగడం, బాధ వంటివి నొప్పికి కారణాలు. (సయాటికా) కు అనిర్దిష్టమైన వెన్నునొప్పికి తేడా ఉంటుంది. దీనిని శరీరంలోకి చొప్పించి వ్యాధిని నిర్ధారించే పరీక్షల అవసరం లేకుండానే గుర్తించవచ్చు.

కశేరు చక్రికేతర కారణాల వలన కలిగే వెన్నునొప్పి పై ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. ఈ రకపు రోగులలో MRI CT స్కాన్లు మామూలుగా, లేదా మామూలుకు దగ్గరగా ఉంటాయి. కొత్తగా జరుగుతున్న పరిశోధనలలో, రేడియో గ్రాఫిక్ అసాధారణతలు ఏమీ లేని రోగులలో పృష్ట రామస్ పాత్రపై దృష్టిని పెడుతున్నారు. పరాంత రామీ సిండ్రోమ్ ను చూడండి.

నిర్వహణ

వెన్నునొప్పికి చికిత్స చేసేటప్పుడు నొప్పితీవ్రతని సాధ్యమైనంత వేగంగా దాదాపుగా తగ్గించడం, రోజువారి కార్యక్రమాలను తనంత తానుగా చేసుకునే సామర్థ్యాన్ని మళ్లీ కలిగించడం, ఇంకా మిగిలి ఉన్న నొప్పికి రోగి సర్దుబాటు అయ్యేలా చూడడం, చికిత్స వలన కలిగే సైడ్ ఎపెక్టులను అంచనా వేయడం, న్యాయపరమైన, సామాజికార్థికపరమైన అవాంతరాల నుండి రోగి ఉపశమనం పొందేలా వసతిని కల్పించడం నిర్వహణా లక్ష్యాలుగా ఉంటాయి. నొప్పిని ఒక స్థాయికి ఆపడం, తద్వారా పునరావాస చర్యలతో ముందుకు సాగడం చాలా సందర్భాలలో లక్ష్యంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక నొప్పి ఉపశమనం పొందవచ్చు. కొందరికి నొప్పి నివారణకు పెద్ద శస్త్ర చికిత్స వరకు పోకుండా, శస్త్ర చికిత్సేతర విధానాలను ఉపయోగించడం లక్ష్యంగా ఉంటుంది. మరికొందరికి త్వరగా కోలుకోవడానికి శస్త్ర చికిత్స ద్వారా నొప్పిని తగ్గించడమే లక్ష్యంగా ఉంటుంది.

అన్ని పరిస్థితులకు, అన్ని రకాల చికిత్సలు సరిపోవు. లేదా ఒకే రకమైన స్థితిలో ఉన్న వ్యక్తులందరికి అన్ని చికిత్సలు సరిపోవు. వారికి అనుగుణమైన చికిత్సా పద్ధతులేవో కనుగొనడానికిగాను వాటిని ఉపయోగించి, వాటిలో ఏది బాగా సరిపోతుందో నిర్ణయించుకోవాలి. రోగి ప్రస్తుత స్థితి (తీవ్రమైనది, లేక ఎడతెగని) కూడా చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తుంది. వెన్ను నొప్పితో బాధపడే వారిలో చాలా తక్కువ మందికి (1% - 10% శాతం మందికి అని అంచనా) మాత్రమే శస్త్ర చికిత్స అవసరమవుతుంది.

నొప్పి

 • వీపు కుంచించుకపోవడం, లేదా ఇతర పరిస్థితులకు వేడి చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. కొక్రేన్ కొలాబరేషన్ నిర్వహించిన వివిధ అధ్యయనాల మెటా ఎనాలసిస్ వలన వేడి చికిత్స, తీవ్రమైన, తక్కువ తీవ్రమైన వెన్ను దిగువ భాగపు నొప్పిని తగ్గించగలదని తేలింది.[5] వేడి తేమ ( ఉదా: వేడి స్నానం, లేదా నీటి సుడి ), లేదా నిరంతర తక్కువ స్థాయి వేడి (వేడిని చుట్టూ చుట్లుగా ఏర్పాటు చేసుకోవడం, అది 6 నుండి 8 గంటల వరకు వేడిని ఉంచుతుంది.) బాగా పనిచేస్తున్నట్లుగా కనుగొన్నారు. శీతల సంపీడన చికిత్స (ఉదా: మంచు లేదా కోల్డ్ ప్యాక్ అప్లికేషన్) కొన్ని సందర్భాలలో ఇది నొప్పిని తగ్గించగలిగింది.
 • కండర విశ్రాంతికారిణులు, ఓపియాయిడ్స్, నాన్‍స్టెరాయిడల్ యాంటి ఇన్‌ప్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు/NSAIAలు) [6] లేదా పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్) వంటి మందులను ఉపయోగించడం. కొక్రేన్ కొలాబరేషన్ నిర్వహించిన యాదృచ్ఛిక నియంత్రిత ప్రయత్నాల మెటా ఎనాలసిస్, సూదిమందు చికిత్సావిధాన ఎంపికకు సంబంధించి తగినన్ని క్లినికల్ ప్రయత్నాలు జరగలేదని కనుగొన్నది. ఈ చికిత్సా విధానంలో కార్టికోస్టెరాయిడ్లను దిగువ భాగపు వెన్నునొప్పికి ఉపయోగిస్తున్నారు. మరో అద్యయనం, కండరాంతర్గత కార్టికోస్టెరాయిడ్స్ వలన ఉపయోగమేమీ లేదని కనుగొనింది.
 • మసాజ్ చికిత్సా విధానంతో అనుభవజ్ఞుడైన చికిత్సా నిపుణుడు స్వల్ప కాలిక ఉపశమనాన్ని కలిగించగలడు. ఆక్యుప్రెజర్ లేదా ప్రెజర్ పాయింట్ మసాజ్ సంప్రదాయ (స్వీడిష్) మసాజ్ కన్నా ఉపయోగకరం.
 • ప్రస్తుత స్థితికి కారణాన్ని బట్టి, భంగిమ శిక్షణా తరగతులు, శారీరక వ్యాయామం నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
 • వ్యాయామాలు చేయడం నొప్పిని తగ్గించే సమర్ధవంతమైన మార్గం. అయితే వాటిని అనుమతి పొందిన ఆరోగ్య నిపుణుని ఆధ్వర్యంలో నిర్వహించవలసి ఉంటుంది. కొన్ని పద్ధతులను అనుసరించి చేసే వ్యాయామాలు వీపు చికిత్సా కార్యక్రమాలలో చాలా ముఖ్యమని అనేక మంది నమ్ముతారు. వ్యాయామం తీవ్రమైన నొప్పి కంటే, ఎడతెగని నొప్పికి బాగా పనిచేస్తుందని ఒక అధ్యయనం వలన తేలింది. నొప్పిని సహించదగిన స్థాయి లో రోజువారీ కార్యక్రమాలు కొనసాగించడం కంటే వీపును సన్నద్ధం చేసే వ్యాయామాలు బాగా పని చేయవని మరో అధ్యయనం వలన తేలింది.
 • శారీరక చికిత్సా విధానంలో హస్త లాఘవం, వ్యాయామం, వీటితో పాటుగా సాగదీయడం, బలంచేకూర్చడం (వెన్నుపాముకు సహకరించే కండరాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది) ఉంటాయి. 'బ్యాక్ స్కూల్స్' వృత్తిపర అమరికలతో ప్రయోజనకరంగా ఉన్నాయి. సోలియోసిస్, కైఫోసిస్, స్పాండలోలిస్థెసిస్, వెన్నుపాము సంబంధిత అపసవ్యాలను స్క్రోత్ విధానం అనే ప్రత్యేకమైన శారీరక వ్యాయామ చికిత్స విధానం ద్వారా చికిత్స చేస్తున్నారు. దీని వలన నొప్పి తీవ్రత తగ్గింది. సోలియోసిస్ ఉన్నవారిలో తరుచూ నొప్పి కనపడడం కూడా తగ్గింది.[7]
 • హస్తలాఘవం కూడా ఇతర పద్ధతుల లాగానే ప్రయోజనాన్ని కలిగిస్తుందని, ప్లాసెబో. కంటే బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 • ఇటీవల జరిపిన యాదృచ్ఛిక నియంత్రిత ప్రయత్నం బూటకపు ఆక్యుపంక్చర్‌కు, నిజమైన దానికి తేడా తక్కువని చెప్పింది.
 • మానసిక, లేదా ఉద్వేగ కారణాలపై దృష్టి పెట్టడానికి విద్య, వైఖరి సర్దుబాటు - ప్రతివాద ఙ్ఞానాత్మక చికిత్సా విధానం, అభివృద్ధికర ఉపశమన చికిత్సా విధానం ఎడతెగని నొప్పిని తగ్గించగలుగుతాయి.

మరికొన్ని నివారణా పద్ధతులు

 • చిన్న పిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌లో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలి. పిల్లలు పాఠశాల బ్యాగ్‌ను వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు పై భాగంలో (అప్పర్ బ్యాక్) ఉంచేలా చూడాలి. పాఠశాల బ్యాగ్ వీపుపై మోసుకెళ్లకుండా చక్రాలపై రోల్ చేసేది ఉంటే మంచిది.
 • పిల్లలు పాఠశాలలోనూ, పెద్దలు పనులు చేసే ప్రదేశంలో ఒంగిపోయినట్లుగా గాక వెన్నును నిటారుగా ఉంచేలా కూర్చోవడం (ఎర్గానమికల్లీ రైట్ పొజిషన్) అలవాటు చేయిస్తే మంచిది.
 • సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యేలా ఆరుబయట తిరగడంతో పాటు మంచి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలకు సరైన పాళ్లలో క్యాల్షియమ్ అంది ఎముకలు గట్టిపడతాయి.
 • బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది.
 • పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి.
 • వీలైనంతగా దగ్గరి బంధువులతో వివాహాలను నివారించడమే మంచిది.
 • కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. మందుల బయోకెమికల్ స్వభావం, వాటి హానికరమైన ప్రభావం, రిస్క్ వంటి అంశాలు తెలిసి ఉండే క్వాలిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది.
 • గాటు తక్కువగా ఉండే శస్త్రచికిత్సలు: మందులతో వెన్నునొప్పి తగ్గకపోతే... ఇప్పుడు అన్ని రకాల వెన్ను సమస్యలకు, సర్వైకల్ డిజార్డర్స్‌కు చాలా సమర్థంగా చేయదగిన సర్జికల్ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి వెన్నుకు ముందూ, వెనకా. ఇలా రెండు వైపులా కూడా చేయదగిన సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.
 • మాగ్నిఫికేషన్: ఇప్పుడు మైక్రోస్కోప్ సహాయంతోనూ, వెన్నెముక వద్ద మంచి వెలుగు ప్రసరింపజేయడం ద్వారానూ వెన్నెముకను పదింతలు పెద్దగా చూసి సమర్థంగా శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతోంది.
 • ఉద్యోగంలో కేవలం కూర్చుని మాత్రమే పని చేసే సందర్భాల్లో ఇటు ఉద్యోగి అటు యాజమాన్యం కూడా సదరు ఉద్యోగి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించి చిన్నపాటి తప్పనిసరి విరామసమయాలు కల్పిస్తే తద్వారా ఆ ఉద్యోగి శరీరమూ కండరాలూ తగినంత కదలికలు కలిగినవై కనీస వ్యాయామంతో వెన్నునొప్పికి దూరం కావచ్చును. అంతేగాక తద్వారా ఆ ఉద్యోగి పనిసామర్థ్యం పెరిగి సంస్థకు కావలసిన పనిని మరింత సమర్థవంతంగా పూర్తి చేయగలడు.

మెడ వెనక భాగంలో నొప్పి...

వెన్నెముకలో భాగంగా మెడ నుంచి మొదలై నడుము వరకు 32 నుంచి 34 ఎముకలుంటాయి. వీటిలో మెడభాగంలో ఉండే ఏడు వెన్ను ఎముకలను సర్వైకల్ స్పైన్‌గా చెబుతారు. శరీరం మొత్తం బరువును వెన్ను నేరుగానో లేదా ఇతరత్రా భరిస్తూనే ఉంటుంది. దాంతో మెడ భాగంలోని వెన్నుపూసలు అరగడం వల్ల ఒక్కోసారి వెన్ను నొప్పి వస్తుంది. ఇది మెడ వెనక భాగంలో కనిపిస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. కొందరిలో ఇది పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల కూడా రావచ్చు. మెడభాగంలో నొప్పి మొదలై, వేళ్ల చివరల్లో తిమ్మిర్లు, మొద్దుబారినట్లుగా ఉండటం వంటి సమస్య వచ్చి నడక కూడా కష్టమైతే ఆ కండిషన్‌ను మైలోపతి అంటారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేయి లాగడం, మెడలోని వెన్నుపూసలు నొక్కుకుపోయి అది పెరాలిసిస్‌గా మారకుండా ఉండేందుకు రైడా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.

ట్యూమర్స్

కొన్ని సందర్భాల్లో వెన్నుపూసలకు ఏవైనా కణుతులు రావచ్చు. ఇలాంటి కణుతుల వ్యాధి నిర్ధారణ చాలా నిశితమైన పరీక్షల ద్వారానే చేయాల్సి ఉంటుంది. రోగి తాలూకు వెన్ను స్వభావాన్ని స్పైన్ సర్జన్ కూలంకషంగా పరిశీలించాక మాత్రమే సర్జరీ చేయాల్సి ఉంటుంది.

శస్త్ర చికిత్స

కొన్ని సమయాల్లో కింది లక్షణాలు కల రోగులకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు:

 • కటి కశేరు చక్రిక పక్కకు తొలగడం లేదా వ్యాధి వలన కశేరు చక్రిక క్షీణించడం
 • కటి కశేరు చక్రిక పక్కకు తొలగడం వలన కటి ప్రాంతపు కశేరు కుల్య కుంచించుకపోవడం, వ్యాధి వలన కశేరు చక్రిక క్షీణించడం లేదా స్పాండైలోలిస్థేసిస్
 • పార్శ్వగూని
 • వెన్నుపూస పగులు

వెన్నునొప్పి యొక్క అనేక లక్షణాలకు, కారణాలకు ఎక్కువగా ఉపయోగించే పరిష్కారం- చిన్న గాటుతో శస్త్ర చికిత్స చేసే విధానాలను పాటించడం. ఈ రకమైన విధానాలు సంప్రదాయ శస్త్ర చికిత్స కన్నా చాలా ప్రయోజనకారిగా ఉంటాయి. ఇవి కచ్చితంగా వ్యాధిని నిర్ధారించడమే కాకుండా, వీటిలో పట్టే సమయం తక్కువగా కూడా ఉంటుంది.[8]

వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయడమనేది చిట్టచివరి ఎంపికగా ఉంటుంది. అన్నిరకాల చికిత్సా విధానాలు వాడి చూసాక, ఆత్యవసర స్థితిలో మాత్రమే దీన్ని సిఫారసు చేస్తారు. 2009లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, కొన్ని రకాల వ్యాధులకు శస్త్ర చికిత్స మిగిలిన వాటికన్నా బాగా పనిచేస్తుంది. అయితే కాలం గడిచేకొద్దీ దాని ప్రయోజనం తగ్గిపోవచ్చు.

అనేక కారణాల వలన కలిగే వెన్నునొప్పిని తగ్గించడానికి చేసే శస్త్ర చికిత్సలు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ శస్త్ర చికిత్సలను ఈ విధంగా వర్గీకరించవచ్చు. నరాల పై ఒత్తిడిని తగ్గించేవి, శరీర ఖండితాలను కలిపేవి, విరూపాలను సరిచేసేవి.[9] మొదటి రకపు శస్త్ర చికిత్సను ప్రధానంగా, నాడీ ప్రకోపనం, నాడులకు హాని కలగడం వంటి స్థితులతో బాధ పడుతున్న ముసలివారికి చేస్తారు. అస్థి ఖండితాలను కలపడాన్ని వెన్ను సంలీనము అని కూడా అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ అస్థి ఖండితాలను లోహాన్ని ఉపయోగించి ఒకటిగా అతికించే ప్రక్రియ. చివరి రకపు శస్త్ర చికిత్సను పుట్టుకతో వచ్చే విరూపాలను సరి చేయడానికి, ప్రమాదాలలో తీవ్రమైన గాయాలై ఎముకలు విరిగినపుడు చేస్తారు. కొన్ని సందర్భాలలో, విరిగిన ఎముకల ముక్కలను తొలగించడం, వెన్నుకు స్థిరత్వాన్నిచ్చే ఏర్పాట్లు చేయడం వంటివి కూడా దీనిలో ఉంటాయి.

వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయడానికి ప్రధానంగా ఉపయోగించే విధానాలు: ఛేదనము, వెన్నుసంలీనము, కశేరుక అస్థి చాపాలను తొలగించడం, కణుతులను తొలగించడం వర్టిబ్రోప్లాస్టిస్.

అంతర్ కశేరుక చక్రిక పక్కకు తొలిగినపుడు, లేదా పగిలినపుడు ఛేదన పద్ధతిని ఉపయోగిస్తారు. చక్రిక పొడుచుకు వచ్చినపుడు, అది నాడీ మూలంపై ఒత్తిడి కలిగిస్తుంది. అపుడు ఛేదన విధానం ద్వారా దానిలోని కొంత భాగాన్ని కానీ, మొత్తంగా కానీ తొలగిస్తారు.[10] కశేరు చక్రిక వలన నాడిపై ఒత్తిడి కలిగినపుడు, ఆ చక్రిక ఉండే ప్రాంతంలో చిన్న గాటు పెట్టి ఒత్తిడి కలిగించే భాగాన్ని తొలగిస్తారు. వెన్నుకు చేసే శస్త్ర చికిత్సలలో ఈ రకమైన పద్ధతి బాగా ఆదరణను పొందింది. దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ రకమైన చికిత్స జరిగాక తిరిగి కోలుకోవడానికి ఆరు వారాలకు మించి ఎక్కువ సమయం పట్టదు. ఎండోస్కోప్నుపయోగించి విరిగిన ఎముక భాగాలను తొలగించడాన్ని పెర్‍క్యుటేనియస్ డిస్క్ రిమూవల్ అంటారు.

సూక్ష్మ ఛేదనా పద్ధతి, ఛేదనా పద్ధతి కంటే వేరుగ ఉంటుంది. దీనిలో సూక్ష్మ దర్శిని వంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వలన ఛేదనంలో కంటే గాటు బాగా చిన్నగా ఉండి, త్వరగా కోలుకునేందుకు వీలు కలుగుతుంది.

రోగిలో కశేరు చక్రికను పూర్తిగా తొలగించినపుడు లేదా వెన్నుముక అస్థిరంగా మారినపుడు వెన్ను సంలీన పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ విధానంలో రెండూ లేదా అంతకన్నా ఎక్కువ వెన్నుముకలను లోహాన్ని ఉపయోగించి ఒకటిగా అతికిస్తారు. దీనివలన చికిత్స చేస్తున్న ఎముకకు అదనపు బలం చేకూరుతుంది. వెన్ను సంలీనం జరిగిన తర్వాత రోగి కోలుకోవడానికి ఒక సంవత్సరం దాకా పడుతుంది. కోలుకునే సమయం రోగి వయసుని బట్టి, శస్త్ర చికిత్స చేసిన కారణాన్ని బట్టి, సంలీనం చేసిన ఎముకలు సంఖ్యను బట్టి మారుతుంది.

కశేరు నాడీ కుల్య కుంచించుకు పోయినపుడు, లేదా కశేరు చక్రిక పక్కకు జరిగినపుడు నాడులపై ఒత్తిడిని లేకుండా చేయడానికి కశేరు అస్థి చాపాలను తొలగిస్తారు. ఈ విధానంలో శస్త్ర చికిత్సా నిపుణుడు అదనంగా ఉన్న కశేరు అస్థిచాపాన్ని తొలగించడం లేదా తగ్గించడం చేసి కశేరు కుల్యను విశాలం చేస్తాడు. దీని వల్ల నాడులకు కావాలసినంత స్థలం ఏర్పడుతుంది. సమస్య యొక్క తీవ్రతను బట్టి, రోగి ఆరోగ్య స్థితిని బట్టి రోగి ఎంత తొందరగా కోలుకోగలడన్నది ఆధారపడుతుంది. ఇది ఎనిమిది వారాల నుండి ఆరు నెలల వరకు ఉండొచ్చు.

హాని కలిగించని, హాని కలిగించే కణుతుల పెరుగుదలను నివారించడానికి వెన్నుకు శస్త్ర చికిత్సను చేస్తారు. హాని కలిగించని కణుతుల విషయంలో, నరాలపై ఒత్తిడి లేకుండా చేయడం శస్త్ర చికిత్స లక్ష్యంగా ఉంటుంది . క్యాన్సర్ వంటి హాని కలిగించే కణుతుల విషయంలో, అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా చేయడం లక్ష్యంగా ఉంటుంది. రోగి కోలుకోవడానికి పట్టే కాలం, తొలగించిన కణుతులు రకాన్ని బట్టి, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి, కణుతుల పరిమాణాన్ని బట్టి మారుతుంది.

సందేహాస్పద చికిత్సాప్రయోజనాల గురించి

 • శీతల సంపీడన చికిత్సా విధానాన్ని వెన్నుభాగంలో ఒత్తిడి కలిగినపుడు, లేదా ఎడతెగని నొప్పి ఉన్నపుడు ఉపయోగిస్తారు. గోల్ఫ్, తోటపని, బరువులు ఎత్తడం వంటి ఎక్కువ శ్రమతో కూడిన పనుల వలన కలిగే నొప్పి, బాధలను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. కొక్రేన్ కొలాబరేషన్ నిర్వహించిన యాదృచ్ఛిక నియంత్రిత ప్రయత్నాల మెటా ఎనాలసిస్ ప్రకారం, "దిగువ భాగపు వెన్ను నొప్పికి శీతల చికిత్సా విధానం చాలా అరుదుగా మాత్రమే పని చేస్తుంది. దాని నాణ్యత కూడా చాలా తక్కువ. కాబట్టి దిగువ భాగపు వెన్ను నొప్పి ఉపయోగం గురించి ఏమి చెప్పలేము.
 • పడక విశ్రాంతి, వ్యాధి లక్షణాలను పెరిగేటట్లు చేస్తుంది కాబట్టి, దాన్ని చాలా అరుదుగా, కేవలం ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమే సిఫారసు చేస్తున్నారు. దీర్ఘ కాలిక పడక విశ్రాంతి, లేదా నిష్క్రియత కాఠిన్యానికి దారితీసి, నొప్పిని ఎక్కువ చేస్తుంది. కాబట్టి, అది చికిత్సా లక్ష్యాన్ని ఆటంకపరుస్తుంది.
 • ట్రాన్సుక్యుటెనస్ విద్యుత్ నాడీ ఉద్దీపనం (TENS) వంటి ఎలక్ట్రోథెరపీని కూడా సూచించారు. రెండు యాదృచ్ఛిక నియంత్రిత ప్రయత్నాలను నిర్వహించినపుడు, ఒకదానితో ఒకటి పొంతన లేని రెండు రకాల ఫలితాలు వచ్చాయి. TENSను ఉపయోగించడం వలన స్థిరమైన ఫలితాలు ఉండవని, కాబట్టి దాన్ని సిఫారసు చేయలేమని కొక్రేన్ కొలాబరేషన్ చెప్పింది.

వెన్నుపాము ఉద్దీపనకు ఉపయోగించే విద్యుత్ పరికరం, మెదడుకు చేరవేసే నొప్పి సంకేతాలను మధ్యలోనే ఆపి, నొప్పికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

 • వ్యతిరిక్త చికిత్సా విధానంలో లాగుడు పద్ధతి, లేదా ఆకర్షక బలం ద్వారా వెన్నుముకను విస్తరింప జేసి రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారు. ఈ రకమైన విస్తరణ వెన్నుముకలో రావడం కోసం ఒకోసారి రోగి ని తల కిందులుగా వేలాడదీస్తారు. ఈ పద్ధతిలో రోగిని పూర్తి నిలువుగా వేలాడదీయకుండా, 10నుంచి 45 డిగ్రీల కోణంలో వేలాడదీసినపుడు గుర్తించదగిన ప్రయోజనాలు కలిగాయి.
 • అల్ట్రాసౌండ్ విధానం ప్రయోజనకారి కాదు. కాబట్టి దాని ఎంపిక చేయలేదు.

గర్భధారణ

50%మంది మహిళలలో గర్భధారణ సమయంలో వెన్ను దిగువ భాగాన నొప్పి వస్తుంది.

గర్భధారణ సమయంలో వెన్నునొప్పి తీవ్రంగా ఉండి, బాధను, అశక్తతను కలిగిస్తుంది. గర్భధారణ తరువాత వచ్చే వెన్నునొప్పిని తట్టుకునేలా చేస్తుంది. గర్భధారణ వలన కలిగే వెన్నునొప్పి మరింతగా పెరిగే అవకాశం ఉండదు. ఈ నొప్పి, బరువు పెరగడం, వ్యాయామం, పనిలో సంతృప్తి లేదా గర్భంలోని బిడ్డ బరువు, పొడవు, బిడ్డ భౌతిక లక్షణాల వంటి వాటి వలన కలుగుతుంది.

గర్భధారణ యొక్క జీవయాంత్రిక కారకాలతో పాటుగా, పొత్తికడపు సగిట్టల్, తిర్యక్ వ్యాసం, లూంబార్ లార్డోసిస్ లోతు వంటివి దిగువ భాగపు వెన్నునొప్పికి కారణమవుతాయి. నిలబడడం, కూర్చోవడం, ముందుకు వంగడం, బరువు లు ఎత్తడం, నడవడం వంటి వాటితో పాటుగా, సంక్లిష్టమైన కారకాలు నొప్పి తీవ్రతను పెంచుతాయి. గర్భధారణ సమయంలో కనబడే వెన్నునొప్పి తొడలలోకి, పిరుదులలోకి వ్యాపించవచ్చు. రాత్రి సమయాలలో ఈ నొప్పి వల్ల నిద్రపోవడానికి వీలుపడక పోవచ్చు. కొన్ని సార్లు పగటి పూట ఎక్కువగానూ, కొన్ని సార్లు రాత్రి పూట ఎక్కువగానూ ఉండవచ్చు. ఈ నొప్పి తీవ్రం కాకుండా ఉండడానికి, శరీరాన్ని అధికంగా వంచి బరువులను ఎత్తడం, ఒంటికాలు మీద నిలబడడం, మెట్లెక్కడం వంటి అసౌష్టవమైన భారాలకు దూరంగా ఉండాలి. శరీరపు దిగువ భాగాలు ఎక్కువగా కదిలేలా చేసే పనులు నొప్పిని తగ్గిస్తాయి. మోకాళ్ళను వంచకుండా సరాసరి కిందికి వంగడం గర్భిణీలలోనూ, మామూలు వ్యక్తులలోనూ వెన్ను దిగువ భాగపు నొప్పికి కారణం అవుతుంది. ఇది కటి - త్రిక ప్రాంతంలో ఒత్తిడిని కలగజేస్తుంది. తద్వారా మల్టీఫిడస్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

ఆర్థిక పరమైన ఫలితాలు

వెన్నునొప్పి వలన చాలామంది శ్రామికులు, నిరంతరం కూర్చొని పనిచేసే కార్యాలయ ఉద్యోగులు, అనారోగ్య సెలవులు ఎక్కువగా పెడుతూ ఉండడంతో, దీన్ని జాతీయ ప్రభుత్వాలు ఉత్పాదకతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే వ్యాధిగా గుర్తిస్తున్నాయి. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‍డమ్ వంటి జాతీయ ప్రభుత్వాలు ప్రజలలో చైతన్యాన్ని పెంచి సమస్యకు వ్యతిరేకంగా పోరాడడానికి, కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాయి. హెల్త్ అండ్ సేఫ్టీ ఎక్జిక్యూటీవ్ల బెటెర్ బ్యాక్స్ క్యాంపెయిన్ దీనికి ఉదాహరణ. అమెరికాలో 45ఏళ్ళు లోపు వ్యక్తులు, వారి కార్యకలాపాలకు అడ్డంకిగా చెప్పే కారణాలలో, వెన్ను దిగువ భాగపు నొప్పి మొదటి స్థానంలో ఉంది. వైద్యులను కలవడానికి చెప్పే కారణాలలో రెండవ స్థానంలోనూ, ఆసుపత్రిలో చేరడానికి ఐదవ కారణంగానూ, శస్త్ర చికిత్స చేయించుకోవడానికి మూడవ కారణంగానూ ఉంది.

బాహ్య లింకులు

మూలాలు

 1. 1.0 1.1 Church E, Odle T. Diagnosis and treatment of back pain. Radiologic Technology [serial online]. November 2007;79(2):126-204. Available from: CINAHL Plus with Full Text, Ipswich, MA. Accessed December 12, 2017.
 2. Burke GL (2008). "Chapter 3: The Anatomy of Pain in Backache". Backache:From Occiput to Coccyx. Vancouver, BC: MacDonald Publishing. ISBN 978-0-920406-47-2.
 3. A.T. Patel, A.A. Ogle. "Diagnosis and Management of Acute Low Back Pain". American Academy of Family Physicians. Retrieved March 12, 2007.
 4. 4.0 4.1 Bogduk N (2005). Clinical anatomy of the lumbar spine and sacrum (4th ed.). Edinburgh: Churchill Livingstone. ISBN 0443060142.
 5. French S, Cameron M, Walker B, Reggars J, Esterman A (2006). "A Cochrane review of superficial heat or cold for low back pain". Spine. 31 (9): 998–1006. doi:10.1097/01.brs.0000214881.10814.64. PMID 16641776.CS1 maint: multiple names: authors list (link)
 6. van Tulder M, Scholten R, Koes B, Deyo R (2000). "Non-steroidal anti-inflammatory drugs for low back pain". Cochrane Database Syst Rev (2): CD000396. doi:10.1002/14651858.CD000396. PMID 10796356.CS1 maint: multiple names: authors list (link)
 7. వీస్ HR,సోలియోసిస్-రిలేటెడ్ పెయిన్ ఇన్ అడల్ట్స్: ట్రీట్‍మెంట్ ఇన్‍ఫ్లుయెన్సెస్ ఫైస్ మెడ్ రెహాబిల్1993; 3(3):91-94.
 8. "Compare Procedures - North American Spine". Retrieved 2010-03-31.
 9. "Types of Surgery for Back Pain". Retrieved June 18, 2010.
 10. "Surgery For Back Pain". Retrieved June 18, 2010.