"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శిరశినగల్ కృష్ణమాచార్యులు

From tewiki
Jump to navigation Jump to search
శిరశినగల్ కృష్ణమాచార్యులు
జననంఆగష్టు 13, 1905
మరణంఏప్రిల్ 15, 1992
నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్
ప్రసిద్ధికవి
మతంహిందూ మతము
తండ్రివేంకటాచార్యులు
తల్లిరంగమ్మ

శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు , కోరుట్ల కృష్ణమాచార్యులు అనే బిరుదులు కలవు. నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు[1].

బాల్యము, విద్యాభ్యాసము

కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు[2]. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద, తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు.

ఉద్యోగము

వీరు 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు.

రచనలు

వీరు సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని:

 1. కళాశాల అభ్యుదయం
 2. రామానుజ చరితం
 3. చిత్ర ప్రబంధం
 4. రత్నమాల (ఖండ కావ్యం)
 5. మనస్సందేశ కావ్యము
 6. సంపత్కుమార సంభవ కావ్యము
 7. గాంధీతాత నీతిశతకము
 8. గీతాచార్య మతప్రభావ శతకము
 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము
 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము
 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము
 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము
 13. పద్మావతీ పరిణయము (హరికథ)
 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ)
 15. ముకుందమాల
 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు
 17. విశిష్టాద్వైతమత సంగ్రహము
 18. వేదార్థ సంగ్రహము (అనువాదం)
 19. గురువంశ కావ్యనిధి

ఇతని ఆత్మకథ పేరు : స్వీయ కవితాను జీవనం

అవధానాలు

వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు.

వీరి అవధానాలలోని కొన్ని పూరణలు:

 • సమస్య: చేకొని రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయున్

పూరణ:

శ్రీకరు నెట్లు ధ్యానమును జేయుట? రావణహంత లెవ్వరన్
ఆ కుశు డేసతీసుతుడు? హంసుని మిత్రము లేవి? దేవసు
శ్లోకు డెవండు? శౌరికి బలుండెవడౌను? వచింపుమా మదిన్
జేకొని, రామలక్ష్మణులు, సీతకు, తమ్ములు, శంభు, డన్నయున్

 • సమస్య: భానుని భానుండు జూచి వడక దొడంగెన్

పూరణ:

దానవుడై మున్నమృతము
బానము జేయంగ దెల్పు పగదీర్ప మదిన్
బూనియు మ్రోలన్ జను స్వ
ర్భానుని భానుండు జూచి వడక దొడంగెన్

 • దత్తపది: గండు - భండు - లండు- పిండు అనే పదాలతో భారతార్థము

పూరణ:

 ధారుణిపుత్రులన్ గనియె ధర్మవిరుద్ధుల పూర్వమందు గాం
ధారి మగండు వార లతిదౌష్ట్యము చేతను ధర్మసూనుడున్
మీరగలండటంచు తమ నేర్పున జూదమునన్ జయింపగా
వారలు భండుపిండులను బట్టి వధించి రాజ్యమేలిరే

 • వర్ణన: కాఫీ

పూరణ:

ఇంద్రియశక్తి కేరగ, మహీతలవాసులు రేబవళ్ళు ని
స్తంద్రత చేర్చి కాచి బలుచక్కడనుండెడి కాఫి పాల, ని
స్సాంద్రకుతూహలంబునను సౌఖ్యద మంచును త్రాగుచుంద్రు రా
చంద్రుని యందునం గలుగు సారము వేల్పులు ద్రాగురీతిగన్

బిరుదులు, సత్కారాలు

వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు.

మూలాలు

 1. నవ వసంతం-1, 6 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-44
 2. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 241–246.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).