షణ్ముగలింగం శివశంకర్

From tewiki
Jump to navigation Jump to search
Shanmugalingam Sivashankar
షణ్ముగలింగం శివశంకర్
దస్త్రం:Pottu Amman.jpeg
జననం1962
నల్లూర్, జాఫ్నా, శ్రీలంక
జాతీయతశ్రీలంక
ఇతర పేర్లుపొట్టు అమ్మన్
వృత్తితమిళ తీవ్రవాది
సుపరిచితుడుమిలిటరీ నిపుణుడు
LTTE ఇంటెలిజెన్స్
బ్లాక్ టైగర్స్ నాయకుడు
స్పై టైగర్స్ నాయకుడు(TOSIS)

షణ్ముగలింగం శివశంకర్ శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాది. పొట్టు అమ్మన్ అన్న అతని మారుపేరుతో సుప్రసిద్ధుడు. శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాద సంస్థ ఎల్.టి.టి.ఈ.లో అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ తర్వాత రెండవ స్థానంలో ఉండేవారు.[1] భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని దారుణంగా హత్యకు కుట్రచేసిన సూత్రధారి పొట్టు అమ్మనే అంటూ హత్యకేసు దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, భారత ప్రభుత్వం నియమించిన జైన్ కమిషన్ వంటివి తేల్చాయి.

వ్యక్తిగత జీవితం

1962లో శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో షణ్ముగలింగం ఉరఫ్ పొట్టు అమ్మన్ జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఐతే ఆయన వ్యక్తిగత వివరాలను, నివాస ఆవాసాలను అత్యంత గోప్యంగా ఉంచేవారు. మరే ఇతర వ్యక్తిగత విశేషాలు బయటకు పొక్కనివ్వలేదు.[2]

ఎల్.టి.టి.ఈ.లో

స్థానం

1981లో పొట్టు అమ్మన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) లో చేరారు. ఉగ్రవాద సంస్థలో అంతర్గతంగా పైకి ఎదుగుతూ ఎల్టీటీఈ మిలటరీ విభాగంలో ప్రభాకరన్ తర్వాత రెండవ స్థానం సాధించారు. ఉగ్రవాద దాడులు, హత్యలకు ఎంతకైనా తెగించే మహిళా ఉగ్రవాదుల బృందం బ్లాక్ టైగర్ (కరుంపులి) విభాగానికి, టైగర్ల నిఘా విభాగమైన టాసిస్ (టైగర్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ ఇంటిలిజెన్స్ సర్వీసెస్) కీ అధిపతి. తమిళనాడులోని వేదారణ్యం ప్రాంతంలో టైగర్లకు నిర్వహించిన శిక్షణ శిబిరాలకు అధినేతగా వ్యవహరించారు.[2]

కార్యకలాపాలు

పొట్టు అమ్మన్ ఉగ్రవాద దాడులు, హత్యలకు సంబంధించి ఏ పనిని ఎవరికి పురమాయించాలో, వారిని ఎలా పర్యవేక్షించాలో, ఏయే సహాయ సహకారాలు అందించాలో తెలిసిన దిట్ట. పరమ క్రూరుడిగా పేరుపొందారు. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర, కార్యకలాపాల పర్యవేక్షణ, హత్య చేసిన ఉగ్రవాదులకు శిక్షణ అందించింది పొట్టు అమ్మన్ అని సిట్ బృందాలు తేల్చాయి. 1993లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాసను మేడే ర్యాలీలో ఆత్మాహుతి బాంబుదాడిలో చంపడం వెనుక కుట్ర, పర్యవేక్షణ కూడా పొట్టు అమ్మన్ దే. ఎల్.టి.టి.ఈ. సంస్థకే రెండవ స్థానంలో ఉన్న ప్రభాకరన్ బంధువు మహాతయ భారత గూఢచారి సంస్థ (రా) కు సమాచారం అందిస్తున్నారన్న అనుమానం వచ్చినపుడు 1992లో పదవిలోంచి తొలగించి, 1993లో నిర్బంధించి, 1994లో చంపినదీ పొట్టు అమ్మనే.[2]

మరణం

షణ్ముగలింగం శివశంకర్ (పొట్టు అమ్మన్) శ్రీలంక అంతర్యుద్ధంలో మే 2009న శ్రీలంక సైన్యం దాడిలో ప్రభాకరన్, ఇతర ముఖ్యనేతలతో పాటు చనిపోయారని కొందరు భావిస్తున్నారు. ఐతే దీనిపై కచ్చితమైన నిర్ధారణ ఏదీ లేకపోవడంతో ఇదొక సందేహంగానే మిగిలిపోయింది. పొట్టు అమ్మన్ మరణించారా, జీవించి ఉంటే ఎక్కడ ఉన్నారు అన్నవి స్పష్టతలేకుండానే మిగిలిపోయాయి.[2]

మూలాలు

  1. "POTTU AMMAN, Sivershankar, Interpol". Archived from the original on 2009-03-25. Retrieved 2016-04-30.
  2. 2.0 2.1 2.2 2.3 ఎం.బి.ఎస్., ప్రసాద్. "రాజీవ్ హత్య - 6". గ్రేట్ ఆంధ్రా. Retrieved 30 April 2016.

ఇతర లింకులు