సత్యమూర్తి

From tewiki
Jump to navigation Jump to search
భావరాజు వెంకట సత్యమూర్తి
150px
సత్యమూర్తి
జననంభావరాజు వెంకటసత్యమూర్తి
జనవరి 1, 1939
రామచంద్రపురం తూర్పు గోదావరి జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుసత్యమూర్తి
వృత్తివ్యాపార ప్రకటనల సలహాదారు, బొమ్మల కూర్పు నిపుణులు, కార్టూనిస్ట్
ఉద్యోగంసత్యసాయి డిజైనింగ్ స్టుడియోస్ (ప్రై)లిమిటెడ్‌
పదవి పేరుచైర్మను
భార్య / భర్తజోగేశ్వరి
పిల్లలుశ్రీ పద్మావతి, సాయి భాస్కర్
తండ్రిరావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ
తల్లివెంకాయమ్మ
సంతకం150px
దస్త్రం:CHADUVULRAAV BY SATYAMURTHY.jpg
సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన చదువుల్రావు

సత్యమూర్తి గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి"ని కలంపేరుగా ధరించి, తెలుగు పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర చదువుల్రావు ఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నాడు.

వ్యక్తిగతం

ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, జనవరి 1, 1939న జన్మించాడు. ఇతని తండ్రి భావరాజుసత్యనారాయణ ఇంజనీరు, "రావు సాహెబ్" బిరుదాంకితుడు. తల్లి పేరు వెంకాయమ్మ. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ, కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (Bachelor of Arts-B.A.), ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్ (Bachelor of Laws-LLB) పూర్తి చేశాడు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి (College of Fine Art, హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించాడు.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు

తన చిన్న వయస్సులోనే, ఇతను 1958నుండి వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టాడు. ఇతను వేసిన వ్యంగ్య చిత్రాలు చక్కగా చెక్కినట్లు ఉంటాయి. గీసిన పాత్రలన్నీ సందర్భానికి సరిపోయ్యేట్టుగా ఉంటాయి. సందర్భానుసారం మరొకరకంగా వెయాల్సి వస్తే తప్ప, సామాన్యంగా బొమ్మలన్నీ కూడా అందంగా వేస్తాడు. బొమ్మలలో చక్కటి నైపుణ్యం, నాణ్యం తొణికిసలాడుతుంటాయి. వేసిన బొమ్మలకు సరిపొయ్యే హాస్య ప్రధానమైన సంభాషణలు చక్కటి తెలుగులో వ్రాయటం ఇతని ప్రత్యేకత.

వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా

సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి. అప్పట్లో (1960, 1970 దశకాలలో) యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా వడ్డాది పాపయ్య ఈ చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, ఇతని వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా ఆంధ్ర పత్రిక ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో ఇతను వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం ఇతడి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ దీపావళి సంచికకు ఇతడి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.

రచనా వ్యాసంగం

దస్త్రం:KARTOON GIYYATAMELAA SATYAMURTY.JPG
వీరు రచించిన కార్టూన్ వెయ్యటం ఎలా అన్న పుస్తకానికి ఆంగ్ల ప్రతి ముఖ చిత్రం

కార్టూన్లు వేయ్యటమే కాకుండా అనేక రచనలు కూడా చేశాడు, పుస్తకాలకు ముఖచిత్రాలు కూడా చిత్రించాడు. వాటిలో కొన్ని:

బొమ్మలు

 • భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశాడు.
 • సనాతన సారథి పత్రిక, ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్ (Bhavans Journal) లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశాడు.

పుస్తకాలు

 • కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్రభూమి వారపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డాడు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్ (How to Draw a Cartoon), హిందీలో కార్టూన్ కైసె బనాయే (कार्टून कैसे बनाए) అన్నపేరుతో ప్రచురించబడింది.
 • శ్రీ సత్యసాయి మీద అనేక పుస్తకాలు
 • భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచాడు.
 • ఫన్ విత్ క్వాలిటీ (Fun with Quality) అన్న పుస్తకం భెల్ (Bharat Heavy Electricals Limited-BHEL) వారికోసం రచించాడు

ఇతరాలు

 • నాగార్జున సిమెంటు వారి వ్యాపార ప్రకటనలను తన కార్టూన్లతో ఆకర్షణీయంగా చేశాడు.
 • భారతదేశంలో పెద్ద బాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సాంవత్సరిక కాలెండరును మూడు సంవత్సరాలపాటు తన కార్టూన్లతో నింపి అలరించాడు.

అందుకున్న బహుమతులు

ఇతని సుదీర్ఘ రచనా, చిత్రకళా వ్యాసంగంలో అనేక బహుమతులను అందుకున్నాడు. అందులో మచ్చుకగా కొన్ని:

 • 1977లో ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కార బహుమతి లభించింది.
 • 1982 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అప్పటి ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు చేతులమీదుగా అందుకున్నాడు.
 • 1986లో వంశీ బర్క్‌లీ వారి ఉత్తమ కార్టూనిస్ట్ బహుమతి లభించింది.
 • 2002లో ఢిల్లీ తెలుగు సంఘంవారి 24వ వార్షికొత్సవ బహుమతి లభించింది.
 • 2002 లోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారి బహుమతి లభించింది.

వ్యంగ్య చిత్రమాలిక