"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సర్పయాగం

From tewiki
(Redirected from సర్పయాగము)
Jump to navigation Jump to search
సర్పయాగం

మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. పాండవుల అనంతరం పరీక్షిత్తు, పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ప్రారంభంలో ఆది పర్వములోనే సర్పయాగం ఉదంతం వస్తుంది. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పాడు. ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం ప్రారంభమౌతుంది.


పైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతను ఒకమారు గురుపత్ని కోరికపై మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. అందువలన అతను తక్షకుని పట్లా, నాగజాతిపట్లా కుపితుడయ్యాడు. జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేశాడు. జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. (ఇక్కడ భారతంలో గరుత్మంతుని వృత్తాంతం కూడా చెప్పబడింది.)


సర్పయాగం తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. "సహేంద్ర తక్షక స్వాహా" అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు.


వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జరత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్ధం కారణజన్ముడై జనించాడు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సయానికి ఆస్తీకుడు అక్కడికి వెళ్ళి, జనమేజయుని మెప్పించి, దక్షిణగా యాగాన్ని నిలుపు చేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు యాగాన్ని ఆపించేశాడు.


మహాభారతంలో ఈ యాగసందర్భంగా చెప్పబడిన సుపర్ణుని (గరుత్మంతుని) కథ విన్నవారికి శ్రీ సంపదలు కలుగుతాయని, పాపము నశిస్తుందని, సర్ప-రాక్షస బాధలు తొలగుతాయని ప్రతీతి. అలాగే ఆస్తీకుని కథ విని, ఆస్తీకుని స్మరిస్తే వారికి నాగజాతివలన ఎటువంటి ప్రమాదమూ కలుగదని, విషజ్వరాదికాలు సోకవని వాసుకి ఆస్తీకునికి వరమిచ్చాడు.


ఈ సర్పయాగం కథ ఆ సమయంలో కురువంశపు రాజులకు, నాగజాతి వారికి జరిగిన సంఘర్షణకు కథాకల్పితరూపమని కొందరి అభిప్రాయం.

ఇదే పేరు తో ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నటుడు, నాటక కర్త మరియు జర్నలిస్ట్ రెంటాల గోపాలకృష్ణ రచించిన కవితా సంపుటి 'సర్పయాగం' విమర్శకుల ప్రశంసలు పొందింది.

మూలాలు

http://www.prajasakti.com/Article/Aksharam/2095664

వనరులు

  • శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - వ్యవహారికాంధ్ర వచనము - రచన: బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి (2001)