"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సింగం బాకటితో గుహాంతరమునం

From tewiki
Jump to navigation Jump to search
సింగం బాకటితో గుహాంతరమునం
220px
నర్తనశాల సినిమాలో ద్రోణాచార్యుని పాత్రలో ధూళిపాళ పద్యాన్ని ఆలపిస్తున్న దృశ్యం
కవి పేరుతిక్కన
మూల గ్రంథంఆంధ్రమహా భారతం
విభాగంవిరాటపర్వం
అధ్యాయంచతుర్థాధ్యాయం
గ్రంథంలో ఆలపించిన పాత్రద్రోణాచార్యుడు
దేశంభారతదేశం
భాషతెలుగు
విషయము(లు)అడవుల్లో నివసించి మనసు పాడైవుండి కుంతీదేవి కుమారుల్లో మధ్యవాడు (అర్జనుడు) యుద్ధానికి సిద్ధమైన బలంతో మన సైన్యంపైకి వస్తున్నాడు
సందర్భంఅర్జునుడిపై అభిమానం కలిగిన గురువు ద్రోణాచార్యుడు ఎన్నో సంవత్సరాల తర్వాత యుద్ధరంగంలో శౌర్యవంతుడై వచ్చిన శిష్యుణ్ణి చూసిన సందర్భంలో
ఛందస్సుశార్దూల విక్రీడితము
సినిమాలలో వాడుకనర్తనశాల

సింగం బాకటితో గుహాంతరాంతరమునంతో ప్రారంభమయ్యే పద్యం ఆంధ్రమహాభారతంలోని విరాటపర్వంలోని చతుర్థాధ్యాయంలోనిది. ఈ పద్యాన్ని తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రఖ్యాతి, మన్నన పొందిన కవుల్లో ఒకరైన తిక్కన రచించారు.[1] ఇది శార్దూల విక్రీడితము చందస్సులో వ్రాయబడినది.

పద్యం

సింగం బాకటితో గుహాంతరమునం జేడ్పాటు మైనుండి మా
తంగ స్ఫూర్జిత యూథ దర్శన సముద్యత్క్రోధమైవచ్చు నో
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీడె వ
చ్చెం గుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్

తాత్పర్యం

జబ్బుచేసి గుహలో ఉండిపోయిన సింహం అది వెనుకబట్టి, ఆకలితో నకనకలాడుతూ గుహబయటకు రాగా ఏనుగుల గుంపును చూసి ఎత్తివచ్చిన క్రోధంతో దుమకబోతున్న విధంగా అడవుల్లో నివసించి మనసు పాడైవుండి కుంతీదేవి కుమారుల్లో మధ్యవాడు (అర్జనుడు) యుద్ధానికి సిద్ధమైన బలంతో మన సైన్యంపైకి వస్తున్నాడు.

సందర్భం

శ్రీమదాంధ్ర భారతం విరాటపర్వంలో చతుర్థాధ్యాయంలోని 59వ పద్యమిది. రెండవమారు జూదంలో ధర్మరాజు ఓడిపోయినప్పుడు పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళు వనవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని అజ్ఞాతవాస కాలంలో వారు పాండవులని బయటపడిపోతే మళ్ళీ మరో 13 సంవత్సరాలు అజ్ఞాతారణ్యవాసాలు చేయాలని నియమం విధిస్తారు కౌరవులు. పన్నెండేళ్ళు అరణ్యవాసం ముగిసి సంవత్సరం పాటు విరాటుని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం సాగిస్తారు. ఆ సంవత్సరకాలంలో వారిని పట్టుకుని మళ్ళీ అరణ్యాజ్ఞాతవాసాలకు పంపాలని దుర్యోధనాదులు ప్రయత్నాలు సాగిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉండివుంటారని అంచనావేసి, వారిని బయటకు రప్పించేందుకు గోగ్రహణాలు(ఆవులను తోలుకుపోవడం) అనే యుద్ధాలు ప్రారంభిస్తారు. దక్షిణం నుంచి సుశర్మ దక్షిణ గోగ్రహణం చేయగా విరాట వీరులు, సైన్యమూ అటు వెళ్ళి యుద్ధం చేస్తారు. ఇంతలో అర్జునుడిని బయటకు లాగే వ్యూహంతో భీష్మ ద్రోణ కర్ణాదులతో సహా దుర్యోధనుడు, కౌరవ సైన్యం ఉత్తర దిక్కు నుంచి ఉత్తర గోగ్రహణం ప్రారంభిస్తారు.
విరాట రాకుమారుడైన ఉత్తరుడు అంత:పురకాంతలతో సారధి ఉంటే యుద్ధంలో కౌరవులని గెలిచేస్తానంటూంటే ద్రౌపది బృహన్నల (అర్జునుడు)ని తీసుకువెళ్ళమంటుంది. చివరకు బృహన్నలతో యుద్ధరంగంలోకి వెళ్ళిన ఉత్తరుడు కౌరవసేనను చూసి బెదిరిపోవడంతో అప్పటికి అజ్ఞాతవాస కాలం పూర్తైన విషయం తెలిసిన అర్జనుడు తన గాండీవం తీసుకుని అర్జున రూపాన్ని ధరంచి యుద్ధంలోకి వస్తాడు. అప్పటికి అర్జునుడు తమ తండ్రి, తమ అన్నదమ్ములు విస్తరించిన రాజ్యాన్ని దురాక్రమించి, అడవులకు తరిమి, చివరకు తమను అజ్ఞాత వ్రతం నుంచి కూడా బయటకు తెచ్చేందుకు వచ్చిన దురాక్రమణదారుపై క్రోధంతో ఉన్నాడు. అర్జునుడిపై అభిమానం కలిగిన గురువు ద్రోణాచార్యుడు ఆ సందర్భంలో ఈ పద్యాన్ని చెప్తాడు.[2]

విశేషాలు

ఛందస్సు

ప్రసిద్ధమైన శార్దూల వృత్త పద్యమిది. తెలుగు పద్యాల ప్రాస, యతి వంటివాటికి అక్షరమైత్రి కలవాలే తప్ప పదవిచ్ఛేదనం కావాల్సిన అవసరం లేదు. అయినా కొందరు కవులు ప్రాస స్థానాల్లో విరుడుగు (పదవిచ్ఛేదం) ఏర్పరిచి పద్యానికి మరింత సొబగు తెచ్చిపెడతారు. ఈ పద్యంలో తిక్కన ఆఖరి రెండు చరణాల్లోనూ ప్రాస స్థానమైన రెండవ అక్షరం వద్ద పదాన్ని విరిగేలా రాశారు. అందులోనూ చివరి చరణంలో అది వ్యంజ్యకంగా ఒప్పుతోంది. చివరి చరణంలో వచ్చెం గుంతీసుత మధ్యముండు అన్నప్పుడు చ్చెం అన్న అక్షరం వద్ద ప్రాస. అక్కడితో పదం విరవడమే కాకుండా అక్కడ మరో చమత్కారమూ చేశారు. సామాన్యంగా వాడు వచ్చాడు అన్నది నిత్యవ్యవహారంలోని వాడుక. అందులో వాడు అన్న కర్త ముందు, వచ్చాడు అన్న క్రియ తర్వాత వస్తుంది. అందువల్ల కర్తకు పెద్ద ప్రాధాన్యత ధ్వనించదు. వచ్చాడు వాడు అని ముందు క్రియ తర్వాత కర్త వస్తే వాడు అన్న కర్తకు చాలా ప్రాధాన్యత వ్యంగ్యభూతమవుతుంది. ఈ ధ్వనిని కూడా ఛందస్సులోని ప్రాస విరుగుడు ఉన్నప్పుడే వేయడం వల్ల అది రెండు విధాలా పద్యాన్ని పండిస్తోంది.[3][4]

శిల్పం

భారత కథ ప్రకారం పేడివాడైన నాట్యాచార్యుడు బృహన్నలగా సంవత్సరం పాటు అజ్ఞాతంగా జీవించిన మహావీరుడు అర్జునుడు. అలాంటి అర్జునుడు ఇక అజ్ఞాతవాసం ముగిసిపోయి గాండీవంతో బయటకు వచ్చిన సన్నివేశాన్ని వర్ణించాల్సివచ్చిన సందర్భంలో తిక్కన దాన్ని ద్రోణాచార్య పాత్రతో చెప్పించారు. అదే శిల్ప విశేషము. ఆ ద్రోణాచార్యునికి అర్జునుని మీద ప్రేమకు, అతని శౌర్యం మీద విశ్వాసానికి అంతం లేదని ఈ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు. అటువంటి ద్రోణుడితో ఈ పద్యాన్ని చెప్పించడంతో నిలిచిపోయే పద్యమైంది. పైగా అప్పటి పార్థుని స్థితిని ద్రోణాచార్యుడెలా భావించాడో తిక్కన అలా భావించారనీ, కథలోని ద్రోణుడు నిజానికి తిక్కన అన్నారు విశ్వనాథ. స్వతాహాగా సేనానియై, సేనానుల వంశానికి చెందిన శౌర్యాభిమాని తిక్కన ఈ పద్యాన్ని రసవత్తరంగా రూపొందించారని ఆయన భావించారు.[4]

శైలి

అనవసరమైన సందర్భంలో అందంగా ఉందంటూ సంస్కృతం వాడను అని తిక్కన చెప్పుకున్నారు. అలా అవసరమైన కొన్ని సందర్భాల్లో ఇదీ ఒకటి. అద్భుతభయానక దృశ్యాలను వర్ణించడానికి దీర్ఘసమాసాలు వాడే వాడుక ఉన్న తిక్కన ఈ సన్నిఏశానికీ ఆ క్రమంలోనే దీర్ఘ సంస్కృత భూయిష్టమైన సమాశాలు వాడారు.[1]

ప్రాచుర్య సంస్కృతిలో

నర్తనశాల సినిమాలో "సింగంబాకటితో గుహాంతరమున" పద్యాన్ని ఘంటసాల స్వరపరచగా మాధవపెద్ది సత్యం ఆలపించారు.[5]

మూలాలు

  1. 1.0 1.1 భద్రిరాజు, కృష్ణమూర్తి (సెప్టెంబర్ 2011). "తిక్కన భారతంలో పలుకుల పొందు". ఈమాట. Retrieved 4 October 2015. Check date values in: |date= (help)
  2. చీమలమర్రి, బృందావనరావు (జనవరి 2012). "నాకు నచ్చిన పద్యం:అర్జునుడి ఎత్తిపొడుపు". ఈమాట. Retrieved 4 October 2015. Check date values in: |date= (help)
  3. భైరవభట్ల, కామేశ్వరరావు (నవంబర్ 2002). "పద్య శిల్పం". ఈమాట. Retrieved 4 October 2015. Check date values in: |date= (help)
  4. 4.0 4.1 విశ్వనాథ, సత్యనారాయణ (2007). సాహిత్య సురభి (2 ed.). విజయవాడ: విశ్వనాథ పబ్లికేషన్స్. pp. 61, 62.
  5. సంగీత సాహిత్యాల ‘నర్తనశాల’[permanent dead link]

ఇతర లింకులు