"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సిరికిం జెప్పడు (పద్యం)

From tewiki
Jump to navigation Jump to search

సిరికిం జెప్పడు అనేది బమ్మెర పోతన రచించిన భాగవతంలోని ప్రసిద్ధిచెందిన తెలుగు పద్యం.

పద్యం

 
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై...భా.8-96-మ.

sirikiM jeppa@MDu; SaMkha chakra yugamuM jaedOyi saMdhiMpa@M; Dae
parivaaraMbunu@M jeera@M 'DabhragapatiM banniMpa@M' DaakarNikaaM
tara dhammillamu@M jakka notta@MDu; vivaada prOtthita Sree kuchO
parichaelaaMchalamaina veeDa@MDu gajapraaNaavanOtsaahiyai.

ప్రతిపదార్థము

 • సిరి = లక్ష్మీదేవి
 • కిన్ = కైనను
 • చెప్పడు = చెప్ప లేదు
 • శంఖ = శంఖము
 • చక్ర = సుదర్శన చక్రము
 • యుగమున్ = జంటను
 • చేదోయి = చేతులు రెంటి యందు
 • సంధింపడు = ధరించుట లేదు
 • ఏ = ఏ
 • పరివారంబునున్ = సేవకులను
 • చీరడు = పిలువ లేదు
 • అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగముల (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}
 • పన్నింపడు = సిద్ధపరుప నియమించడు
 • ఆకర్ణిక = చెవి దుద్దుల
 • అంతర = వరకు జారినట్టి
 • ధమిల్లమున్ = జుట్టు ముడిని
 • చక్కనొత్తడు = చక్కదిద్ధుకొనుట లేదు
 • వివాద = ప్రణయకలహము నందు
 • ప్రోత్థిత = పైకిలేపిన
 • శ్రీ = లక్ష్మీదేవి యొక్క
 • కుచ = వక్షము
 • ఉపరి = మీది
 • చేలాంచలము = చీర కొంగు
 • ఐనన్ = అయినను
 • వీడడు = వదలిపెట్టుట లేదు
 • గజ = గజేంద్రుని
 • ప్రాణ = ప్రాణాలను
 • ఆవన = కాపాడెడి
 • ఉత్సాహి = ఉత్సాహము కలవాడు
 • ఐ = అయ్యి.

తాత్పర్యం

గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు.

బయటి లింకులు