"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సిల్క్ రోడ్

From tewiki
Jump to navigation Jump to search
చైనా నుండి వియత్నాం, జావా, ఇండోనేసియా, భారతదేశం, మధ్య ఆసియా, ఇరాన్, అరేబీయ ద్వీపకల్పం, ఈజిప్టు గుండా ఐరోపా వరకూ ఉన్న పట్టు దారి . భూమార్గాలు ఎరుపురంగులోనూ, జలమార్గాలు నీలంరంగులోనూ చూపించబడ్డాయి


పట్టుదారి లేదా సిల్కు మహామార్గం (ఇంగ్లీషు - Silk Road), అనునది పూర్వకాలంలో అఫ్రికా, ఆసియా, ఐరోపా భూభాగాలలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ ఆసియా లను మధ్యధరా సముద్రం, ఐరోపాతో బాటు ఉత్తర, తూర్పు అఫ్రికాల వాణిజ్యమార్గాలను కలుపుతూ ఏర్పడిన చారిత్రాత్మక అల్లిక. కొన్ని చోట్ల ఎర్ర సముద్రం నుండి తూర్పు ఆఫ్రికా, భారతదేశం, చైనా, అగ్నేయ ఆసియాలకు సముద్రమార్గాలు కూడా పట్టుదారి లోకి చేర్చబడ్డాయి.

చైనా యొక్క ప్రసిద్ధ పట్టు పేర ఇది పట్టుదారిగా వ్యవహరిస్తారు. హన్ సామ్రాజ్యకాలంలో ప్రారంభమైన ఈ వాణిజ్యమార్గం, తదనంతర కాలంలో 6500 కి.మీకు పైగా విస్తరించింది. మధ్యయుగాలలో భూమార్గాల కన్నా జలమార్గాల వాడకం ఎక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుత కాలంలో భూ, సముద్ర మార్గాలన్నిటినీ వాడుతున్నారు.

ఈ పట్టుదారి భారతదేశం, చైనా, ప్రాచీన ఈజిప్టు, పర్షియా, అరేబియా, ప్రాచీన రోమ్ లలో గొప్ప గొప్ప నాగరికతలకు దోహదపడటమే కాక ఆధునిక ప్రపంచ నిర్మాణానికి కూడా కారణమయ్యింది. చైనీయ పట్టు ఈ దారిన ప్రధాన వాణిజ్య వస్తువు అయినప్పటికీ, ఇతర వాణిజ్య వస్తువులు కూడా ఉన్నాయి. ఈ దారి గుండా ఎన్నో శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలు, మతాలు, తత్త్వశాస్త్రాలు లతో బాటు ప్లేగు వంటి వ్యాధులు కూడా ప్రయాణించాయి. ఈ దారి గుండా చైనా ప్రధానంగా పట్టు, తేయాకు, పోర్సలీన్ ఎగుమతి చేసేది. భారతదేశం సుగంధద్రవ్యాలు, దంతాలు, మిరియాలు, నేతవస్త్రాలు, విలువైన రత్నాలూ ఎగుమతి చేసేది. రోమన్ సామ్రాజ్యం బంగారం, వెండి, ద్రాక్షరసం, తివాచీలు, నగలు ఎగుమతి చేసేది. పట్టుదారి పొడవునా పూర్తిగా ప్రయాణించినవారు చాలా తక్కువ. మధ్యలో ఎంతోమంది దళారీలు ఉండేవారు. ప్రాచీన భారతీయులు, బాక్టీరియనులు ప్రధాన వర్తకులుగా ఉండగా క్రీ.శ 5-8 శతాబ్దాలలో సోగ్దియనులు, ఆ తర్వాతకాలంలో అరేబియా, పర్షియా వర్తకులు ప్రధానంగా వర్తకం చేసేవారు.