"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సురభి మాధవ రాయలు

From tewiki
Jump to navigation Jump to search

సురభి మాధవరాయలు 17వ శతాబ్దికి చెందిన రాజకవి. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థానాధిపతి. కల్వకుర్తి తాలుకాలోని సురభి ప్రాంతం వీరి పూర్వికులది. ఈ సురభిని పూర్వం గోదలు అని, ప్రస్తుతం గోడల్ అని పిలుస్తున్నారు. విజయనగర రాజు వీర వెంకటపతి రాయల నుండి జటప్రోలు సంస్థానాన్ని పొందిన ' బింకోలుగండ ' బిరుదాంకితుడు ఇమ్మడి మల్లా నాయుడు వీరి తాత. చెన్నమ్మ, ముమ్మడి మల్లా నాయుడు వీరి తల్లిదండ్రులు. ఒక వైపు ప్రజారంజకంగా పాలన సాగిస్తూనే, మరో వైపు నిరంతరం సాహిత్య సముద్రంలో మునిగితేలిన గొప్ప పండితుడు. పండితులకు అగ్రహారాలను పంచిపెట్టిన కవి పోషకుడు. జటప్రోలులో నాయుని పేటను, మదనగోపాల స్వామి మందిరాన్ని, మంచాలకట్టలో మాధవ స్వామి ఆలయాన్ని, సింగవటంలో నృసింహాలయాన్ని, మాధవరాయలపేటను, నరసింహసాగర తటాకాన్ని నిర్మించాడు. ఈ తటాకం వలన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడని ప్రతీతి. అన్నిటికి మించి వీరు తెలుగు సాహిత్యలోకానికి చేసిన ఎనలేని మేలు ఎలకూచి బాలసరస్వతిని తన ఆస్థానంలో ఆదరించడం. భర్తృహరి "సుభాషిత త్రిశతి"ని తన తండ్రి మల్లా నాయుడు పేరు మీద 'మల్ల భూపాలీయం ' పేరుతో అనువదింపజేసి ఎలకూచి బాలసరస్వతికి రెండు వేల దీనారాలను అందజేసిన కవి పోషకుడు. కవులను ఆదరించడమే కాకుండా స్వయంగా తానే కలం పట్టి కవిత్వం రాసిన కవి కూడా. 'చంద్రికాపరిణయం' పేరుతో ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని రచించాడు. 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.

కుటుంబం

మాధవరాయల తండ్రి సురభి మల్లభూపాలుడు పద్మనాయకవంశానికి మూలపురుషుడైన బేతాళనాయకుడుకు 19వ తరం వాడు. ఇతని కుమారుడూ సురభి నరసింగరావు కూడా సంస్కృత కవి.[1]

విసిష్ట రచన

ఆంధ్రసాహిత్యములో గల అఖండపాండితీమండితము, అత్యంతకఠినమైన గ్రంథములలో ప్రథమగణ్యమైనది. పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన జటప్రోలు (కొల్లాపురం) సంస్థానమున కథీశుడైన శ్రీ సురభి మాధవరాయలవారి చంద్రికాపరిణయ మహాప్రబంధము. కవిత్వములోను, శ్లేషలోను ఇది రామరాజభూషణుని వసుచరిత్రమునకు ప్రతిబింబమువలె ఉంటుంది. కాని ఇందులో వ్యాకరణసాధ్యమైన విచిత్రపదప్రయోగములు తఱచుగా నుండుటచే దీని శైలి వసుచరిత్రమున కంటే కఠినమై పండితులకు కూడా దుర్భేద్యముగా నున్నది. మాధవరాయలు 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానము నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు. ఇట్లితడు రామరాజభూషణునకు సమకాలికు డగుచున్నాడు.

మూలాలు

https://web.archive.org/web/20151024090052/http://eemaata.com/em/library/candrikaparinayamu/7250.html

  1. పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 24

మూస:నాగర్‌కర్నూల్ జిల్లా కవులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).