"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు వ్యాసం/2009 52వ వారం

From tewiki
Jump to navigation Jump to search

ముచ్చివోలు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలానికి చెందిన అతి పెద్ద పంచాయితీలలో ఒకటి. శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుంచి ఆం.ప్ర.రా.రో.ర.సం. బస్సులలో సుమారు 30 నిమిషాలలో ఈ గ్రామానికి చేరుకొనవచ్చును. గ్రామ దేవత బైకమ్మ. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకీ విద్యావంతుల గ్రామంగా దీనికి పేరుంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. అంగన్ వాడీ నుంచి పదవ తరగతి వరకూ విద్యా సౌకర్యం ఉంది. మూడు ప్రధాన ఆలయాలు, మూడు చిన్న ఆలయాలు ఉన్నాయి. సాంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి మొదలైన పండుగలే కాక పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు, బైకమ్మ సంతర్పణ ఘనంగా నిర్వహిస్తారు.

గ్రామానికి ప్రధాన గ్రామదేవత బైకమ్మ. ప్రతి యేటా వూరి చెరువుగట్టుపై ప్రతిష్టించబడిన ఈ దేవతకు భక్తి శ్రద్ధలతో సంతర్పణ జరుపుతారు. ఈ సంధర్భంగా గ్రామస్థులు చిన్న-పెద్ద, పేద-ధనిక, కుల-మత బేధాలు లేకుండా చెరువు గట్టునే సహపంక్తి భోజనం చేస్తారు. ఎక్కువ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. రైతులు వరి మరియు వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఆవులు, బర్రెల పెంపకం ద్వారా పాలు అమ్మి గ్రామస్తులు చెప్పుకోదగిన ఆదాయాన్ని గడిస్తుంటారు.

గ్రామము నందు ఒక అంగన్‌వాడీ కేంద్రం, ఒక ప్రాథమిక పాఠశాల కలవు. ప్రక్క గ్రామాలైన మంగళపురి, ఎర్రగుడిపాడు, ముద్దుమూడి నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికే వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. కళాశాల చదువుకు మాత్రం ఎవరైనా ప్రక్కనే ఉన్న శ్రీకాళహస్తికి వెళ్ళాల్సిందే. అక్షరాస్యాతా శాతం 75%. ఇక్కడి నుంచి చాలామంది ఇంజనీర్లుగా (ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ఐ.టి) బెంగుళూరు, మరియు అమెరికాలలో పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇంకా బోధన, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, మీడియా, టెలికాం, న్యాయ శాస్త్రం మొదలైన అన్ని రంగాలలోనూ ఈ ఊరి వారు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఊరి ప్రజలకు ఇది గర్వకారణం.

ప్రతి యేటా పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పాండురంగ స్వామి భక్తబృందం దీని నిర్వహణా భాద్యతలు చేపడుతుంది. ఈ భక్త బృందం లోని సభ్యులందరూ తప్పనిసరిగా ఉత్సవాలు జరిగిన అన్ని రోజులూ పండరి భజన లో పాల్గొంటారు. కొన్ని గ్రామాల్లో కోలాటం కూడా ప్రదర్శిస్తారు. చుట్టుపక్కల గ్రామాలనించి కూడా ప్రజలు వచ్చి ఈ ఉత్సవాలను తిలకించడం విశేషం.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి