అశోక్ మన్కడ్

From tewiki
Revision as of 23:54, 16 October 2013 by imported>YVSREDDY (వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

1946, అక్టోబర్ 12న జన్మించిన అశోక్ మన్కడ్ (Ashok Vinoo Mankad) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత క్రికెట్ జట్టు తరఫున ఇతడు 22 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అశోక్ మన్కడ్ తండ్రి వినూ మన్కడ్ కూడా భారత్ తరఫున 44 టెస్టులలో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సోదరులు రాహుల్ మన్కడ్ మరియు అతుల్ మన్కడ్‌లు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినారు. భార్య నిరుపమ మన్కడ్ మాజీ ఏషియన్ టెన్నిస్ చాంపియన్. వీరి కుమారుడు హర్ష్ మన్కడ్ డేవిస్ కప్ టీంలో సభ్యుడు. అశోక్ మన్కడ్ ముంబాయి రంజీ ట్రోఫిలో క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా పనిచేశాడు.

విద్యార్థి దశలో ఉన్నప్పుడే అశోక్ మన్కడ్ హరీశ్ షీల్డ్ పోటీలలో 348, 325 and 258 వ్యక్తిగత స్కోర్లను సాధించాడు. అండర్-19 టోర్నమెంటులో ముంబాయి మరియు పశ్చిమ జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కళాశాల మొదటి సంవత్సరమే ముంబాయి విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించి రోహింటన్ బారియా ట్రోఫీలో పాల్గొన్నాడు. నాగ్పూర్ విశ్వవిద్యాలయంపై 62, కర్ణాటక విశ్వవిద్యాలయంపై 131, ఫైనల్లో మద్రాసు విశ్వవిద్యాలయంపై 152 పరుగులు సాధించాడు. 17 సంవత్సరాల వయస్సులోపే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినాడు.

టెస్ట్ క్రికెట్

దేశవాళి పోటీలలో మంచి గణాంకాలు కలిగి ఉన్నందున 1969-70లో న్యూజీలాండ్ పై టెస్ట్ క్రికెట్‌కై ఎంపికైనాడు. విజయ్ మర్చంట్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ యువ ఆటగాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వడంతో అదే మ్యాచ్‌లో చేతన్ చౌహాన్, అజిత్ పాయ్ లు కూడా రంగప్రవేశం చేశారు. తొలి రెండు టెస్టులలో కలిపి నాలుగు ఇన్నింగ్సులు ఆడిననూ 30 పరుగులు దాటనందుకు మూడో టెస్టులో స్థానం లభించలేదు. నెల తరువాత ఆస్ట్రేలియా పై ఆడటానికి మళ్ళీ జట్టులో స్థానం పొందినాడు. ఈ సారి తొలి 5 ఇన్నింగ్సులలో 74, 8, 64, 68 మరియు 97 స్కోర్లు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. తొలి టెస్టులో మూడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగి నవాబ్ పటౌడితో కలిసి నాలుగవ వికెట్టుకు 146 పరుగుల భాగస్వామ్యం సాధించాడు. దిలీప్ సర్దేశాయ్ తొలిగించబడిన తరువాత మిగితా మూడు టెస్టులలో ఓపెనర్‌గా విధులు నిర్వహించాడు. ఆ తరువాత మరో 15 టెస్టులు ఆడిననూ రెండు అర్థసెంచరీలు మినహా చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయాడు. 1970-71లో వెస్ట్‌ఇండీస్ పై సునీల్ గవాస్కర్ తో కలిసి ఓపెనర్‌గా ఆడినాడు. అదే సంవత్సరం ఇంగ్లాండు పర్యటనలో విఫలమై జట్టునుంచి తొలిగించబడ్డాడు.

రంజీ ట్రోఫి

టెస్ట్ క్రికెట్‌లో స్థానం కోల్పోయాక దేశవాళీ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాత్స్‌మెన్‌గా బ్యాతింగ్ చేపట్టాడు. 1976-77 రంజీ సీజన్‌లో అశోక్ మన్కడ్ 206 పరుగుల సగటుతో 827 పరుగులు సాధించాడు. మహారాష్ట్ర జట్టుపై 203 నాటౌట్, హర్యానా జట్టుపై 208 నాటౌట్ భారీ పరుగులు సాధించి రంజీ టర్నమెంటులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. దీనితో అజిత్ వాడేకర్ పేరిట ఉన్న రికార్డు అశోక్ మన్కడ్‌చే అధికమించబడింది. ఈ గణాంకాలచే మళ్ళీ టెస్ట్ జట్టులో స్థానం పొంది 1977-78లో ఆస్ట్రేలియాలో ఒక పర్యటన జరిపాడు. ఆ పర్యటనలో 50.80 సగటుతో 508 పరుగులు సాధించాడు. కాని టెస్టులలో 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా చేతన్ చౌహాన్ ఓపెనింగ్ బ్యాటింగ్ చక్కగా చేయడంతో మళ్ళీ టెస్టులలో ఆడలేకపోయాడు.

అశోక్ మన్కడ్ రంజీట్రోఫీలో 76 సగటుతో 6619 పరుగులు సాధించాడు. 22 సెంచరీలు చేసి విజయ్ హజారే రికార్డును సమం చేశాడు. బొంబాయి రంజీ జట్టుకు 1974*75, 1975-76 లలో 2 సార్లు నాయకత్వంతో ట్రోఫి సాధించిపెట్టాడు.