"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జైపూర్ కాలు

From tewiki
Revision as of 20:26, 14 July 2020 by imported>Arjunaraocbot (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

జైపూర్ కాలు అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్‌తో తయారుచేయబడిన కృత్రిమ అవయవము. మోకాలు క్రింది భాగం నుండి పాదం వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుంది. ఇది ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది, సులువుగా తయారు చేయడానికి, అమర్చుకోవడానికి అనువైనది. జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం వంటి తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చు. దీని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరుపొందింది.

చరిత్ర, అభివృద్ధి

జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ఎముకల వైద్య నిపుణుడైన ప్రమోద్ కరణ్ సేథీ1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలో సేథీ రబ్బరు, చెక్క, అల్యూమినియంతో దీనిని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు. 1975 వరకు తక్కువమందికి ఈ కృత్రిమ అవయవం అమర్చినా 1975 నుండి 14.5 లక్షల మందికి ఈ కృత్రిమ కాలును ఉపయోగించారు.

భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి

1969లో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన జైసల్మేర్ జిల్లా కలెక్టర్ డా|| దేవేందర్ రాజ్ మెహతా వైద్య ఖర్చులు భరించలేని పేద వికలాంగుల సహాయం కోసం భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి (BMVSS)ని జైపూర్ లో స్ధాపించాడు. ఈ సంస్థ తరఫున సుమారు ఒక్కొక్కటి 2500 రూపాయలు ఖరీదు చేసే జైపూర్ కాలు ఉచితంగా అమర్చబడుతున్నది. పేద కుటుంబాలు ఏ కులం, మతం, జాతీ తేడా లేకుండా వారికి ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నది BMVSS. పేషెంట్‌ని దృష్టిలో పెట్టుకుని చేసే ఈ సంస్థ సేవలు, కొత్తగా కృత్రిమ అవయవాలు పెట్టుకున్న వారికి ఒకేషనల్‌ ట్రైనింగ్ కూడా ఇస్తున్నది. వారికి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తోంది. మారుమూల గ్రామాల్లో కూడా వెళ్లి సేవలు అందిస్తున్న BMVSS, దేశ వ్యాప్తంగా 22 సెంటర్లతో తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి, వికలాంగుల కోసం ప్రత్యేకంగా సేవ చేస్తున్న సంస్థలలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్ధ.

ప్రసిద్ధి

అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత ఈ జైపూర్ కృత్రిమ కాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ వీటిని అమర్చినది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా వీటినే అమర్చుకున్నారు. ప్రముఖ నటి సుధా చంద్రన్ కూడా జైపూర్ కాలునే అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.

అవార్డులు

ఈ కృత్రిమ అవయవ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ చేసిన సేవలకు గుర్తింపుగా 1981లో మెగ్సేసే అవార్డు, అదే సంవత్సరం భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించాయి. డాక్టర్|| దేవేందర్ రాజ్ మెహతాకు 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారంతో, 2013లో రాజస్థాన్ ప్రభుత్వం రాజస్థాన్ రత్న పురస్కారంతో సత్కరించింది.

మూలాలు