"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భారత విభజన

From tewiki
Revision as of 20:18, 15 August 2018 by imported>Rajasekhar1961 (వర్గం:భారత విభజన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

1947 ఆగస్టు 15న బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యాన్ని విభజించి పాకిస్తాన్, భారత దేశములను ఏర్పరచడాన్ని భారత విభజన అంటారు. బెంగాల్ ప్రావిన్స్ని పశ్చిమ బెంగాల్, తూర్పు పాకిస్తాన్ లుగానూ, పంజాబ్ ప్రావిన్స్ని పశ్చిమ పంజాబ్, తూర్పు పంజాబ్ (ప్రస్తుత భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛండీగఢ్ లుగా ఏర్పరచివుంది)లుగా విభజించడం మాత్రమే కాక రైల్వేలు, సైన్యం, భారత సివిల్ సర్వీసులు, కేంద్ర ఖజానా మొదలైన బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యంలోని సంబంధిత దేశాల ఆస్తులను విభజించడమూ భారత విభజన అంటారు.

నేపథ్యం

భారతదేశం విభజన ముస్లింలీగ్ రాజకీయ పక్షం, దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రధాన నినాదమైన ద్విజాతి సిద్ధాంతం, బ్రిటీష్ ప్రభుత్వం విభజించి పాలించు అన్న పాలన సిద్ధాంతం వంటివి భారత విభజనకు ముఖ్యనేపథ్యం. రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఈ రెంటికి తోడు - కాంగ్రెస్ ముఖ్యనేతలైన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ తదితరులు 1920ల్లోనూ, 30ల్లోనూ రాజకీయంగా మహమ్మద్ అలీ జిన్నాను, ముస్లిం లీగ్ ను తక్కువ అంచనా వేసి రాజకీయ చర్చల్లో పట్టువిడుపుల ధోరణి కనబరచకపోవడం కూడా భారత విభజన ఇష్టపడనివారి వైపు నుంచి కారణంగా చెప్తారు.[1]

బెంగాల్ విభజన (1905), ముస్లింలీగ్ ఏర్పాటు

1905లో లార్డ్ కర్జన్ ప్రభుత్వం బెంగాల్ విభజన చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి బెంగాల్ ప్రావిన్సును ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్న బెంగాల్ తూర్పుభాగం (చాలాభాగం ప్రస్తుత బంగ్లాదేశ్, ప్రస్తుత అస్సాంల్లో ఉన్నాయి), హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పశ్చిమ భాగాన్ని (ప్రస్తుతం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తరించింది) విభజించి తూర్పుబెంగాల్, పశ్చిమబెంగాల్ ఏర్పాటుచేశారు. పశ్చిమ ప్రాంతాల్లో అధికంగా నివసించే హిందూ జమీందారులు తూర్పు ప్రాంతాల్లోని తమ భూములను అక్కడి ముస్లిం రైతులకు కౌలుకు ఇచ్చేవారు, అలానే పశ్చిమ ప్రాంతంలో మెజారిటీ బెంగాలీ హిందువులను బిహారీల సంఖ్య డామినేట్ చేసేలా విభజన జరిగిందని, ఇది తమ రాజకీయ చైతన్యానికి విధించిన శిక్షగా వారు భావించారు. దీనికి వ్యతిరేకంగా బెంగాలీలు, ప్రధానంగా పశ్చిమ బెంగాల్లోని హిందువులు, వందేమాతరం ఉద్యమాన్ని చేపట్టారు. విభజన జరిగిన ఐదేళ్ళ అనంతరం ఉద్యమం కారణంగానూ, పరిపాలనా సరళీకరణలో భాగంగానూ బెంగాల్ పునరేకీకరణ జరిగింది. ఐతే ముస్లిం సంపన్నులు, విద్యావంతులు ప్రత్యేక నియోజకవర్గాలు (ప్రతి నియోజకవర్గానికి జనరల్, ముస్లిం అన్న రెండు స్థానాలను ఏర్పరిచి ముస్లింలు ముస్లిం స్థానాలకే ప్రత్యేకంగా ఓటు చేసే విధానం) కావాలన్న డిమాండ్ ను 1906లో అప్పటి కొత్త వైశ్రాయ్ లార్డ్ మింటో ముందుంచారు. మరోవైపు పూర్వం తమకు రాజరికం ఉండడం, బ్రిటీష్ రాజ్యానికి సహకరించడం వంటి కారణాలతో తమకు మరింత ఎక్కువ ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో కల్పించాలని కోరారు. ముస్లిముల ఈ ఆకాంక్షల్ని రాజకీయంగా ఆశిస్తున్న బ్రిటీష్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూండడంతో 1906లో ఢాకాలో అఖిల భారత ముస్లింలీగ్ పక్షాన్ని ఏర్పాటుచేశారు.

విభజించి పాలించు సిద్ధాంతం

ముస్లిం సంపన్నులు, విద్యావంతులను ప్రతిబింబించే ముస్లింలీగ్ బెంగాల్ విభజనకు అనుకూల దృక్పథాన్ని స్వీకరించింది. నిజానికి 1871 జనాభా లెక్కల్లో మొదటిసారిగా మతప్రాతిపదికన జనాభాను లెక్కించినప్పటి నుంచి ఉద్రిక్తలు ఏర్పడుతూనే ఉన్నాయి. 1857లో భారత ముస్లింలు బ్రిటీష్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పోరాడిననాటి నుంచి ఎలాగైనా వారిని బ్రిటీష్ సామ్రాజ్యానికి అనుకూలురుని చేయాలని చేసిన ప్రయత్నాలు బెంగాల్ విభజనతో వాస్తవరూపం దాల్చినట్టయింది. 19వ శతాబ్ది చివరి భాగంలో హిందువులకు అధికారంలో మరింత భాగస్వామ్యం లభిస్తూండడం, ఆపైన హిందీ-ఉర్దూ వివాదం చెలరేగడం, గోవధ వ్యతిరేకోద్యమాలు జరగడం వంటివాటితో ఉత్తరప్రదేశ్ ముస్లిముల్లో భయాలు, రాజకీయ ఆకాంక్షలు ప్రబలమయ్యాయి. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమకారులు (ప్రధానంగా హిందువులు) వందేమాతరం నినాదాన్ని చేపట్టడంతో ఆ నినాదం ఉన్న పద్యం హిందూ ముస్లిం వివాదాలకు సంబంధించిన ఆనంద్ మఠ్ నవలలోదన్న విషయాన్ని రాజకీయ నాయకులు బయటకు తీశారు. ఢాకా నవాబ్ ఖ్వాజా సలీముల్లా వంటివారి రాజకీయ ఆకాంక్షలు కూడా వీటికి తోడయ్యాయి. కాంగ్రెస్ బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూండగా సలీముల్లా తూర్పు బెంగాల్, అస్సాం ప్రాంతాల్లో విభజనకు అనూకూలంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.

లక్నో ఒప్పందం

1911లో వందేమాతరం ఉద్యమం ఫలితంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం బెంగాల్ ను తిరిగి ఏకీకరించడం ముస్లిం లీగ్ లోనూ, ఆ పార్టీ నాయకత్వంలోనూ బ్రిటీష్ ప్రభుత్వంపై అపనమ్మకాన్ని ఏర్పరిచింది. టర్కీ, జర్మనీలకు వ్యతిరేకంగా పోరాడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది. తరచుగా మక్కా, మదీనా, జెరూసలేం వంటి ముస్లిం పవిత్ర స్థలాల రక్షణ బాధ్యతను ప్రకటించుకుంటూండే టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫా మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటీష్ కి వ్యతిరేకంగా పోరాడడం కూడా కారణమయింది. బ్రిటన్, దాని మిత్రరాజ్యాలు టర్కీతో యుద్ధం సాగిస్తుండడంతో అప్పటికే బెంగాల్ పునరేకీకరణ సమయంలో ఏర్పడ్డ అపనమ్మకాలు ధ్రువపడి, బ్రిటీష్ ప్రభుత్వం మతపరమైన తటస్థవైఖరి అవలంబించట్లేదని ముస్లిం లీగ్ భావించింది.
మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయ సైనికులు బ్రిటన్ పక్షాన పాల్గొనడం, బ్రిటన్ విజయానంతరం ప్రపంచవ్యాప్తంగా నానాజాతి సమితిలోనూ, వింటర్ ఒలింపిక్స్ లోనూ బ్రిటీష్ ఇండియాను ఒక రాజ్యంగా గుర్తించడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్ జాతీయోద్యమాన్ని మరింత విస్తృతపరిచి స్వయం పరిపాలన కోసం డిమాండ్ ను తీవ్రతరం చేయడం ప్రారంభించింది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలు ముస్లింలీగ్, కాంగ్రెస్ పరస్పర సహకారం అనే అనూహ్య పరిణామానికి తెరతీసింది. కొందరు ముస్లింలీగ్ నాయకులు వ్యతిరేకించిన ప్రధానంగా లీగ్ లోని యువతరం ఈ లక్నో ఒప్పందానికి మద్దతు తెలిపింది. ప్రధానంగా యునైటెడ్ ప్రావిన్సుకు చెందిన అలీ సోదరులుగా ప్రఖ్యాతులైన మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీలు, వారి యువ అనుచరులు దీన్ని సాధ్యమయ్యేందుకు లీగ్ పరంగా కృషిచేశారు. ఈ ఒప్పందాన్ని అప్పటికి యువ న్యాయవాది, తర్వాతికాలంలో భారత జాతీయోద్యమంలోనూ, లీగ్ లోనూ, పాకిస్తాన్ ఏర్పాటు ఉద్యమంలోనూ కీలక స్థానం పొందిన జిన్నా సమర్థించారు.
ఈ ఒప్పందం ప్రకారం భారత జాతీయోద్యమానికి ముస్లింలీగ్ సహకరించడం, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే కాక, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మతపరమైన ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింలకు ఇచ్చేలా అంగీకరించారు. ఏర్పడిన కొన్నేళ్ళకు ఒప్పందం పూర్తి స్వభావం బయటపడింది - ఇది అప్పటికే మెజారిటీతో ఉండి ఎలాగూ గెలిచే పంజాబ్, తూర్పు బెంగాల్ ముస్లిములకు ప్రయోజనం లేకపోగా యునైటెడ్ ప్రావిన్స్, బొంబాయి, మద్రాస్ వంటి ప్రావిన్సుల్లో మైనారిటీలుగా ఉన్న ముస్లిములకు మాత్రం రాజకీయంగా ప్రయోజనకరం.

మాంటెగ్-ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు

మూలాలు

  1. రామచంద్ర, గుహ (డిసెంబర్ 2010). "విభజన తార్కికత". గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు (అనువాదం) (1 ed.). విజయవాడ: ఎమెస్కో. pp. 26–35. కాకాని చక్రపాణి తెలుగు అనువాదం Check date values in: |date= (help)CS1 maint: unrecognized language (link)