లక్ష్మి

From tewiki
(Redirected from లక్ష్మీ)
Jump to navigation Jump to search
లక్ష్మిదేవి

లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు.లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది, రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని, రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది.ఈమెకు అనేక అవతారాలు కూడా ఉన్నాయి (అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత).విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా, అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా,మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా,కలియుగంలో వెంకటేశ్వరస్వామి భార్య పద్మావతిగా అవతరాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది:లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు.ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం, వరమహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మిదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మి పూజలు జరుపుకుంటారు.శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యం యొక్క దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్ష్యం పొందినట్లేనని భావన.

అష్టలక్ష్ములు

  1. ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
  2. ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
  3. ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించింది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
  4. గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
  5. సంతానలక్ష్మి : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉంది.
  6. విజయలక్ష్మి : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
  7. విద్యాలక్ష్మి : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
  8. ధనలక్ష్మి : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.

మూలాలు

వెలుపలి లంకెలు