సర్పంచి

From tewiki
Revision as of 23:21, 3 February 2021 by 2401:4900:35f7:5fc9:1:1:8122:12e1 (talk) (→‎ఎన్నిక)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

పంచాయతి అధ్యక్షుడిని సర్పంచి అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది. గ్రామ స్థాయి స్థానిక స్వయం పరిపాలన చట్టబద్ధమైన సంస్థను భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో గ్రామ పంచాయతి అని అంటారు. గ్రామ పంచాయితికి సర్పంచితో పాటు, ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు. వీరిని వార్డు మెంబర్లు అంటారు. సర్పంచి ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటారు. [1]

సర్పంచ్ అర్థం

సర్ అర్థం పెద్ద (నాయకుడు), పంచ్ అర్థం నిర్ణయించువారు, దీని ప్రకారం సర్పంచి అనగా గ్రామ నిర్ణయ రూపకర్తల పెద్ద.

ఎన్నిక

సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు జిల్లా ప్రాతిపదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ వుంటాయి.. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీ అభ్యర్థులు వుండరు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించటానికి, ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమానం ఇస్తుంది.

అర్హతలు

గ్రామ పంచాయితికి పోటీ చేసే వ్యక్తి అదే పంచాయితిలో ఓటు హక్కును కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇద్దరు బిడ్డలు కన్నా ఎక్కువ ఉండకూడదు.గ్రామ పంచాయతికి సర్పంచితో పాటు ఎన్నుకోబడిన మెంబర్లలో ఒకరిని ఉపసర్పంచిగా ఎన్నుకుంటారు, ఉపసర్పంచిని మెజారిటీ పరంగా మెంబర్లే ఎన్నుకుంటారు, ఉపసర్పంచి పదవికి పోటీ పడిన అభ్యుర్థులలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో వారిలో ఒకరిని ఉపసర్పంచిగా సర్పంచి ఎన్నుకుంటారు.రిజర్వేషన్ కేటాయించిన స్థానాలలో, రిజర్వేషన్ ఉన్నవారు ఎవరు లేనట్లయితే, లేక రిజర్వేషన్ ఉన్నా వారు సర్పంచి పదవికి పోటీ చేయనట్లయితే ఉప సర్పంచిగా ఎన్నుకోబడిన వ్యక్తే సర్పంచిగా (ఇన్‌ఛార్జి సర్పంచిగా) బాధ్యతలు స్వీకరిస్తారు.

ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధిస్తే ఆ వ్యక్తి శిక్ష విధించిన రోజు నుంచి ఆరేండ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడు.

తొలగింపు

సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్‌ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్‌ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి ఆదేశాల మేరకు గ్రామ పాలనా బాధ్యతలను వీడీవో లేదా పంచాయతీ కార్యదర్శి నిర్వహిస్తారు.

అధికారాలు

  • ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ.
  • గ్రామ పంచాయతి సమావేశాలకు అధ్యక్షత.
  • గ్రామ పంచాయతి నిర్ణయాల అమలు.
  • గ్రామ కార్యనిర్వహణాధికారి/ కార్యదర్శి పని పర్యవేక్షణ.
  • గ్రామాభివృద్ధి అధికారి నుండి కావలసిన సమాచారం సేకరణ, సభ్యుల అనర్హతను, ఖాళీలను జిల్లా పరిషత్ అధికారులకు తెలియచేయుట.
  • మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు.

సర్పంచ్ గౌరవ వేతనం

సర్పంచ్‌లకు తెలంగాణలో రూ. 5000, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3000 గౌరవ వేతనం లభిస్తుంది.

ఇవీ చూడండి

మూలాలు

  1. గాజుల సత్యనారాయణ (2013-12-09). తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష. గాజుల సత్యనారాయణ. pp. 731–734.

వెలుపలి లంకెలు